పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ‘‘మొన్నటి వరకు మనతో కలిసి ఉన్న పవన్ కల్యాణ్ మనల్ని విమర్శిస్తున్నారు. కేంద్రం ఎన్ని విధాలా ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోంది. మనల్ని ఇబ్బందులు పెడతారు, సమస్యలు సృష్టిస్తారు. ఐదు కోట్ల మంది ఐక్యతగా ఉంటే.. కేంద్రం ఆటలు సాగవు. 29 సార్లు దిల్లీకి వెళ్లా, ఎప్పుడూ రాజీ పడలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరాగాంధీ నుంచి రాజశేఖర్రెడ్డి వరకూ నన్నేమీ చేయలేకపోయారు. నిజాయితీగా ఉన్నందునే నన్నేమీ చేయలేకపోయారు. నేనెవరికీ భయపడను.. తప్పు చేసిన వారెవ్వరినీ వదలను అంటూ పదునైన విమర్శలు చేసారు...
రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత భాజపాకు లేదా? నేనేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్నా. ఈనెల 30న తిరుపతిలో సభ నిర్వహిస్తున్నాం’’ అని సీఎం వివరించారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్లే బ్యాంకుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వ్యక్తులను పీఎంవోలో పెట్టుకుంటూ... ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రక్షణ లేదని, దానికి కేంద్రప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
బ్యాంకులు దివాళా తీస్తున్నాయని, బ్యాంకుల్లో తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేయాలంటే గజగజలాడే పరిస్థితి వస్తుందని, తప్పు చేసేవారిని వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, జమ్మూకశ్మీర్లో జరిగిన ఘోరం చూస్తే... ఆడబిడ్డలు ఏ విధంగా ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏడాదిలోపల మొత్తం జప్తు చేస్తామని అన్నారని, అవినీతిని ప్రక్షాళన చేస్తామని అన్నారని, అలాంటి అవినీతిపరులను పక్కన పెట్టుకుని, ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకోవాలని అనుకుంటోందని, వేరే రాష్ట్రాల్లో కేంద్రం ఆటలు సాగాయి గానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఆటలు సాగవని ఆయన అన్నారు.