ఆర్ధికంగా రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా తాను వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుసక్తూ ఈమూ రైతులకు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈమూ రైతులకు జీవో నెం. 14 ద్వారా రుణ మాఫీ చేసినందుకు ఎంపీ మాగంటి బాబు, రైతు సంఘం నేతలు కంతేటి వెంకటరాజు ఆధ్వర్యంలో రైతుల వచ్చి సచివాలయంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తున్నామని చెప్పారు. ఈమూ రైతుల రుణాలు మాఫీ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రోత్సాహంతో 2008-09 సంవత్సరంలో చిన్న, సన్నకారు రైతులకు దన్నుగా ఉండాలన్న లక్ష్యంతో నాబార్డు బ్యాంకర్ల సహకారంతో రైతులచే ఈమూ పక్షుల పెంపకాన్ని ప్రోత్సహించింది. అయితే ఈమూ పక్షుల ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, మార్కెటింగ్ కానీ లేనంద వల్ల, పక్షులను పెంచిన రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. అలాంటి కష్టకాలంలో ఈమూ రైతుల బాధలను మాగంటి, కంతేటి తదితరులు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో భాగంగా వచ్చిన నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి దృష్టికి తెచ్చారు. ఆనాడు ఈమై రైతుల కష్టాలను విని చలించిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే సమస్యను సావధానంగా అధ్యయనం చేశారు. పలుమార్లు ఈ అంశంపై మాగంటి, కంతేటి ముఖ్యమంత్రిని కలిశారు. అదేవిధంగా ఈ సమస్యను ముఖ్యమంత్రి గారు ఎస్.ఎల్.బి.సి సమావేశంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సిహెచ్. కుటుంబరావుతో కలసి బ్యాంకర్లకు వివరించారు. బ్యాంకర్లు కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు లో 50%, 25% బ్యాంకర్లు, 25% రైతులు భరించే విధంగా ఈ నిష్పత్తిలో వారికి న్యాయం చేసేందుకు, పూర్తిగా వడ్డీమాఫీ చేయడానికి ఎస్.ఎల్ .బి.సిలో తీర్మానం చేయించారు.
ముఖ్యమంత్రిని సత్కరించిన ఈమూ రైతులు... ఇదే విధంగా జీవో నెం..14 ద్వారా ఈమూ రైతులకు రుణమాఫీకి ఆదేశాలు జారీ చేసినందుకు మంగళవారం కంతేటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఈమూ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సత్కరించారు. ముఖ్యమంత్రి వీరికి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఏలూరి ఎంపీ మాగంటి బాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నారాయణ, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఈమూ రైతు నాయకులు కాకాని శ్రీనివాసరావు, వల్లూరు వంశీ కృష్ణ, కర్నాటి అశోక్ బాబు, కర్నాటి అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.