పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఖర్చు పెట్టిన వ్యయంలో ఇంకా కేంద్రం చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా తిరిగిచ్చేలా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీకి లేఖలు రాయాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ‘పునరావాసం-పరిహారం’ ప్యాకేజ్ కింద నిర్వాసిత కుటుంబాల కోసం చేపట్టిన కాలనీల అభివృద్ధిని శరవేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ఇప్పటివరకు 15 కాలనీలను అభివృద్ధి చేశామని, ప్రస్తుతం 38 కాలనీలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే పూర్తయిన 15 కాలనీలలో 3,348 నిర్వాసిత కుటుంబాలు నివాసం వుంటున్నాయని తెలిపారు. టెండర్ల దశలో వున్న మరో 7 కాలనీల పనులను వచ్చే నెల మొదటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న 38 కాలనీలతో పాటు, వచ్చే నెల నుంచి చేపట్టే 7 కాలనీల నిర్మాణంతో 16,687 నిర్వాసిత కుటుంబాలకు నివాస సదుపాయం కలుగుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు.

cbn 16042018

సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గడిచిన వారం రోజుల్లో 2.29 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 28 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 42 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తంమీద 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 795.390 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయని చెప్పారు. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 5.14 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని అన్నారు. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,175.6 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,450 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయినట్టు తెలిపారు.

cbn 16042018

స్పిల్ వే నిర్మాణంలో తొలిసారిగా వారం రోజుల్లో 5 వేల క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ పనులు చేపట్టడం, డయాఫ్రమ్ వాల్ పనులు లక్ష్యాన్ని మించి సాగుతుండటంపై అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇప్పటివరకు 52.20% పోలవరం ప్రాజెక్టు పూర్తికాగా, కుడి ప్రధాన కాలువ 89.10%, ఎడమ ప్రధాన కాలువ 58.30% పనులు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 71.30% మేర స్పిల్ వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు, 14.60% వరకు స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు, 82.40% డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, జెట్ గ్రౌంటింగ్ 61%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయినట్టు తెలిపారు.

cbn 16042018

ప్రభుత్వం చేపట్టిన 53 ప్రాధాన్య ప్రాజెక్టులలో పులకుర్తి ఎత్తిపోతల పథకం, హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశలో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్ ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని, అడవిపల్లి ఎత్తిపోతల పథకం వచ్చే నెల 15 నాటికి సిద్ధం కానుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్మాణం పనులు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయని చెప్పారు. 2015-16 నుంచి 2017-18 వరకు 6,59,744 పంటకుంటలు ఏర్పాటు చేశామని, 65,966 చెక్‌డ్యామ్‌లు నిర్మించామని తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read