మహిళలపై దాడులు చేసే బలహీనులను పట్టించుకోనని సినీ నటి పూనమ్ కౌర్ అన్నారు. ‘‘ఆయుధాలు లేని వాళ్లతో యుద్ధం చేయకూడదని గురు గోవింద్ చెబుతారు. బలహీనులతో యుద్ధం చేయకూడదంటారు. ఏ వ్యక్తి అయినా ఓ అమ్మాయితో పోరాటం చేస్తున్నాడంటే, అతడు బలహీనుడని అర్థం. దిగజారిపోయిన వ్యక్తే మహిళతో తప్పుగా ప్రవర్తిస్తాడు. మోసం చేయాలనుకుంటాడు. అలాగని నేను తిరగబడి కక్ష సాధించేందుకు ఫూలన్ దేవిని కాదు కదా? అందుకే మోసం చేసేవాళ్లని దేవుడే చూసుకుంటాడని నమ్ముతాను’’ అని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌కు విద్యా సంస్థలను తీసుకొచ్చారని, అందుకే తనలాంటి వాళ్లు చదువుకోగలిగారని అన్నారు. ఆయన వల్లే తాను నిఫ్ట్ లాంటి జాతీయస్థాయి విద్యాసంస్థలో చదువుకున్నా అన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై తన గౌరవాన్ని రాజకీయం చేయవద్దని, గురు గోవింద్‌ను గౌరవించినట్టే ఆయననూ గౌరవించానని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడనని, తాను ఏది మాట్లాడినా దాన్ని రివర్స్‌లో తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.
తప్పుడు మార్గంలో సరైన లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేమంటూ గురు గోవింద్ మాటలను ఉటంకించారు. ‘‘నేను పోరాడుతున్నప్పుడే నా బలం ఏమిటో నాకు తెలుస్తుంది. ఎవరికీ హాని కల్గించే పనిని నేను చేయను. నాతో యుద్ధం చెయ్. ఏం జరుగుతుందో జరుగుతుంది అనుకుంటాను. మిమ్మల్ని ఓసారి కొట్టారనుకోండి. నొప్పి అనిపిస్తుంది. మళ్లీ కొడితే, మళ్లీ మళ్లీ కొడితే నొప్పికి మీరు అలవాటు పడిపోతారు. నా విషయంలో అదే జరిగింది అనుకుంటాను’’ అని స్పష్టం చేశారు. ఎవరైనా బలహీనతలతో ఆడుకోవడం.. అమ్మాయి జీవితంతో ఆడుకోవాలని అనుకోవడం చాలా తప్పు అని చెప్పారు. అలాంటివాళ్లు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని అన్నారు. స్వామీజీలుగా బయటకు కనిపించిన వాళ్లు కూడా జైళ్లలో ఉన్నది అందుకే కదా అని అభిప్రాయపడ్డారు. తాను ఎవరి నాశనాన్ని కోరుకోనని అన్నారు.
అలాంటివాళ్లు వాళ్లంతట వాళ్లే మారాలని, వారిలో మార్పు రావాలని కోరుకున్నారు. ‘‘నేను ఈ క్షణం వరకూ ఎవరి సాయం ఆశించలేదు. చిన్నప్పటి నుంచీ ఇంతే. 12వ తరగతి వరకూ మాత్రమే తల్లిదండ్రులపై ఆధారపడ్డా. ఆ తర్వాత స్వతంత్రంగా బతుకుతున్నా. నేను నా ఆత్మను ఎప్పటికీ అమ్ముకోను. వ్యక్తిత్వంతో ఉన్నా. సమాన హక్కులను నమ్ముతాను. నేను నిఖార్సైన సిక్కు మహిళను’’ అని పూనమ్ అన్నారు. తన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసునని, అందరి ఆడపిల్లల్లా వీళ్ల ఆటలు తన దగ్గర చెల్లవని అన్నారు. ఎవరైనా ఏం చేయగలరు? ప్రాణం తీస్తారా అని ప్రశ్నించారు.