అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శైలి గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు.. ఎవర్ని అయిన మొహమాటం అనేది లేకుండా కడిగేస్తూ ఉంటారు.. ఉన్నది ఉన్నట్టు మొఖం మీద చెప్పేసి వస్తారు... ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు,నిరసనలు పూర్తయిన తరువాత, జేసీ దివాకర్‌రెడ్డి నేరుగా రాజధాని అమరావతికి వచ్చారు. చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో దాదాపు అరగంటసేపు ఏకాంతంగా భేటి అయ్యారు. బస్సు యాత్ర పేరుతో జిల్లా కేంద్రాలకు ఎంపీలను తీసుకువెళితే బాగోదని...మనం దృష్టి కేంద్రీకరించిన అంశం ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని నిర్మోహమాటంగా చెప్పారు. అలా కాకుండా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాలకు వెళితే బాగుంటుందని సూచించారు. ఇంటింటికీ తెలుగుదేశం మాదిరిగా గ్రామాలలోకి వెళ్లాలనే సలహా ఇచ్చారు జేసీ . ఒకవేళ బస్సు యాత్రను నిర్వహించినా.. ఈ కార్యక్రమాన్ని కూడా చేపడితే బాగుంటుందేమో ఆలోచించాలని ముఖ్యమంత్రికి జేసీ వివరించారు.

jc chandrababu 15042018

మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారట! 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎంపీ విశ్లేషించారట! దీంతో పాటు రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లోనూ.. వివిధ శాఖల్లోనూ అవినీతి ఎక్కువగా ఉందని .. ఎమ్మార్వో కార్యాలయాలలో డబ్బు ఇవ్వందే పనులు జరగడం లేదని...జనం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా రాజకీయ పరిణామాలను కూడా విశ్లేషించారు జేసీ.. పవన్‌కల్యాణ్‌.. జగన్మోహన్‌రెడ్డిలను కలిపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు. ఇద్దరిని కలిపి ఎన్నికలలో పోటీ చేయిస్తే టీడీపీ ఓడిపోతుందనేది నరేంద్రమోదీ వ్యూహం కావచ్చని అన్నారు. జగన్‌, పవన్‌లు చెరో సగం సీట్లకు పోటీ చేసే అవకాశం ఉందని.. ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని చూస్తున్నారని జేసీ వివరించారు.

jc chandrababu 15042018

ఇవన్నీ చంద్రబాబుకు చెబుతూనే.. ఇకనుంచి పార్టీపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు. ఎన్నికల వరకు ఇదే టెంపోను కొనసాగించాలని జేసీ కోరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, జనసేన, కాంగ్రెస్‌, బీజేపీలు విడివిడిగా పోటీ చేస్తే తమకు కలిసివస్తుందని జేసీ విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికారపక్షానికి అడ్వాంటేజ్‌ అవుతుందన్నారు. ఇక శాఖాపరమైన సమీక్షలతో కాలం గడపకుండా పార్టీ కోసం సమయం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహా ఇచ్చారు. నియోజకవర్గాలలో ఉన్న చిన్న చిన్న విబేధాలను పరిష్కరించడంతో పాటు, అభ్యర్థుల గుణగణాలను, ఎంపికపై కసరత్తు నిర్వహించాలన్నారు. కార్యకర్తలను ఎన్నికల దిశగా నడిపించాలని సలహా ఇచ్చారు. అధినేతలకు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించడం తన ధర్మమని.. ఆయన చెప్పినవి చక్కగా వింటారని జేసీ వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read