కొన్ని నెలలు క్రితం జరిగిన సంఘటన ఇది... త్వరలోనే శ్రీకాకుళంలో ధర్నా చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ధర్నా చేయడం ఏమిటి అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేసాయి... సాధారణంగా ప్రతిపక్షాల వాళ్లు ధర్నాలు, దీక్షలు చేస్తూ ఉంటారు... అయితే ఏపీ సీఎం ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం. ఎందుకలా.. అంటే, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ఏపీ సీఎంకు ఆగ్రహం వచ్చింది. ఈ విషయంలో జిల్లాల వారీగా చూసుకుంటే.. శ్రీకాకుళం బాగా వెనుకబడి ఉందని ఆయన చెప్పారు. అక్కడ ప్రజల్లో, అధికారుల్లో చలనం తేవడమే లక్ష్యంగా శ్రీకాకుళంలో తను ధర్నాను చేపట్టబోతున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు.
అయితే ముఖ్యమంత్రి చేసిన ఈ హెచ్చరికను అక్కడి అధికారులు నిజం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం గోపాలపురంలో మరుగుదొడ్లు నిర్మించుకోడానికి ముందుకురాని వారి ఇళ్ల ఎదుట ఆందోళనకు దిగారు అక్కడి అధికారులు. ఈ గ్రామంలోని 54 కుటుంబాలవారు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోడానికి ముందుకు రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ కుటుంబాల్లో మార్పు రాలేదు. దీంతో తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో తిరుపతిరావు, ప్రత్యేకాధికారి రాంబాబు బుధవారం ఆ గ్రామానికి వెళ్లారు. ఎంత చెప్పినా వారిలో మార్పు లేకపోవడంతో మండుటెండలో సుమారు గంటపాటు వారి ఇళ్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
దీంతో గ్రామస్థులు స్పందించి.. ఆ 54 కుటుంబాలతో చర్చించారు. మూడు రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులు హామీ ఇవ్వడంతో అధికారులు ఆందోళన విరమించారు. దీనిపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి చంద్రబాబు చేసిన ఈ హెచ్చరిక భవిష్యత్తులో బాగానే వర్కౌట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై అందరినీ కదిలింపజేయడానికి శ్రీకాకుళంలో ధర్నా అని ప్రకటించారు చంద్రబాబు, ఇది వరకూ ఇదే విషయంలో కలెక్లర్ల ఆఫీసు ముందు ధర్నాకు దిగుతా అని హెచ్చరించారు.. మొత్తానికి, చంద్రబాబు ఏదైతే ప్లాన్ చేసారో, అధికారులు కూడా ధర్నాలతో, ప్రజలకు అవగాహన కలిగించి, ప్రజలకు మంచి చేస్తున్నారు...