ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రికి, కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. చమురు ధరల తగ్గింపు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపు వ్యత్యాసాలపై లేఖలు రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు రాసిన లేఖలో కోరారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా చమురు ధరలు తగ్గడం లేదని తెలిపారు. ముడిచమురు ధరలు తగ్గినా ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని, ముడిచమురు ధరలు తగ్గినా 9 సార్లు సుంకం పెంచడం సరికాదని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు, ఉపాధి హామీ నిధుల పై మరో లేఖ రసారు చంద్రబాబు... గ్రామీణ కూలీలు, ప్రత్యేకించి వ్యవసాయ కూలీల (నరేగా) భత్యాల్లో గత నాలుగేళ్లుగా పెరుగుదల శూన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖరాశారు. ‘‘ఏపీలో 2014-15లో ‘నరేగా’ వేతనం రూ.180 ఉంది. 2016-17లో రూ.194, ఆ తర్వాత రూ.197, తాజాగా రూ.205 ఉంది. మొత్తంగా ఈ నాలుగేళ్లలో చూస్తే వేతనం 13.8 శాతం పెరిగింది. కానీ అదే సమయంలో ఎనిమిది నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం 72 శాతం పెరిగాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నిస్ప్రహ నెలకొంద’’ని ఆ లేఖలో తెలిపారు. హరియాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ఇస్తున్న స్థాయిలోనే, ఏపీలో కూడా ఉపాధి హామీ వేతనాన్ని ఇవ్వాలని కోరారు. మరో పక్క ప్రధాని మోడీకి, పీఎంఏవైలో ఏపీకి మొండిచెయ్యి పై మరో లేఖ రసారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్’ (పీఎంఏవై-జి) కింద రాష్ర్టాలకు ఇళ్ల కేటాయింపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రజాసాధికార సర్వేను ప్రామాణికంగా తీసుకుని ఇళ్ల కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై బుధవారం ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో 20.99లక్షల మంది ఇళ్లు లేని పేదలు పీఎంఏవై పథకానికి అర్హులుగా ఉన్నట్లు మా సర్వేలో తేలింది. దానిని కేంద్రం ప్రామాణికంగా తీసుకుని ఇళ్ల కేటాయింపులు చేయాలి’’ అని కోరారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశామని, ఒకసారి అసెంబ్లీలో, మరోసారి కేబినెట్లో తీర్మానాలు చేసి పంపామని గుర్తుచేశారు. ‘‘2022 నాటికి ’అందరికీ ఇళ్లు’ అనే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. అందులోభాగంగా రాష్ర్టాలకు పీఎంఏవై ఇళ్లు మంజూరు చేస్తోంది. అయితే ఏపీకి రావాల్సినన్ని ఇళ్లు రావడం లేదు. పీఎంఏవై-జి ఇళ్ల కేటాయింపునకు 2011లో నిర్వహించిన సోషియో ఎనకమిక్ కాస్ట్ సర్వేను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల మాకు అన్యాయం జరుగుతోంది. ఆ సర్వే ఏపీలో సక్రమంగా జరగలేదు. అనేక అంతరాయాలతో గందరగోళంగా సర్వే సాగింది. ఆ సర్వే ప్రకారం పీఎంఏవై-జి పథకానికి రాష్ట్రంలో కేవలం 5.83లక్షల మంది మాత్రమే అర్హత సాధించారు. దానికి అనుగుణంగా 2016-17, 2017-18 సంవత్సరాలకు గాను రాష్ర్టానికి 1,23,112 ఇళ్లు మాత్రమే వచ్చాయ’’ని పేర్కొన్నారు.