జాతీయ స్థాయిలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను వ్యతిరేకిస్తూ మే 7న నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరగనుంది.. అయితే ఈ సమావేశానికి, కొన్ని రాష్ట్రాల రాకుండా అడ్డుకుంటానికి, కేంద్రం అడ్డుపడుతుంది... కొన్ని రాష్ట్రాలని భయపెట్టి, ఈ సమావేశానికి రాకుండా ప్రయత్నాలు చేస్తుంది.. ఇదే విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది... ఆర్థికమంత్రుల సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తోందని.., ఈ బెదిరంపు ధోరణి సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఉపాధ్యక్షులు కుటుంబరావు విమర్శించారు.
సదస్సుకు పశ్చిమబంగ, కేరళ, పంజాబ్, దిల్లీ, కర్ణాటక మంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రావాల్సి ఉందన్నారు. కేంద్రప్రభుత్వం వారిపై ఒత్తిడి తెచ్చి సదస్సుకు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌పై పెంచుకున్న కక్షసాధింపునకు ఈ పరిణామం పరాకాష్ఠ అని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకూ తీవ్ర నష్టం కలిగేంచేలా ఉన్నాయన్నారు. ఈ విధివిధానాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు ఎదుర్కొనే లోటును పూడ్చాల్సిన ఆర్థిక సంఘం లోటు భర్తీ కుదరదంటూ ఆర్థిక సంఘం నిబంధన పెట్టిందని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఎక్కడి నుంచి నిధులు వస్తాయన్నారు.
జనాభాకు వెయిటేజీ ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘానికి నివేదికనిచ్చారని, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయి పన్నును తిరిగి రాష్ట్రాలకు 100శాతం ఇవ్వాలని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూచించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రధాని అయ్యాక ఆయన పద్ధతి మారిందని విమర్శించారు. బలహీనంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సిందేనన్నారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో ‘న్యూ ఇండియా 2022’ ఆధారంగా నిధులు ఇవ్వాలంటున్నారని, దీనికి ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించారు. మోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాలపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయమై తెలుగుదేశం ఎంపీలు రానున్న పార్లమెంటు సమావేశాల్లో విధివిధానాల మార్పుపై పోరాటం చేస్తారన్నారు.