ప్రస్తుతం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వైరం నేపధ్యంలో, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కు మరో గండం లాంటిది వచ్చి పడింది... పోలవరానికి పర్యావరణ అనుమతులు, ఈ జూలై 2తో ముగుస్తాయి... ప్రతి సంవత్సరం కేంద్రం, దీన్ని పొడిగిస్తూ వస్తుంది... మరి ఈ సారి ఏమి చేస్తుందో అని రాష్ట్ర అధికారులు టెన్షన్ పడుతున్నారు... ఇదే విషయం పై ఢిల్లీ వెళ్లారు.. పోలవరం పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా సడలించడం కాకుండా, శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలసంఘాన్ని కోరింది. పోలవరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 31 బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై సీడబ్ల్యూసీ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలవరం డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ నాగిరెడ్డి, మరికొందరు ఇందులో పాల్గొన్నారు. పూర్తిస్థాయిలో చర్చించడానికి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి గురించి రాష్ట్ర అధికారులు సీడబ్ల్యూసీకి పవరపాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పోలవరం నిర్మాణం పై ఉన్న షరతులను తొలగించాలని కోరింది. ఒడిశాలో తలెత్తే ముంపును దృష్టిలో ఉంచుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేంతవరకూ నిర్మాణ పనులు నిలిపేయాలని 2011 ఫిబ్రవరి 8న అప్పటి యూపీయే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాతి కాలంలో ఈ షరతులను సమయానుకూలంగా ఆరునెలలు, సంవత్సరంపాటు సడలిస్తూ వస్తున్నారు. తాజాగా 2017 జులై 5న ఇచ్చిన సడలింపు ఈ ఏడాది జులై 2తో ముగియనుంది. ఇలా ప్రతిసారీ నిర్మాణ పనుల పై ఆంక్షలు విధించడం వల్ల తమకు పూర్తి అసౌకర్యం కలుగుతోందని, ఈ నిబంధనలను శాశ్వతంగా ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తాజా సమావేశంలో కోరారు.
ఇదే అంశం పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రికి లేఖ కూడా రాసినట్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. 2010-11 ధరల స్థాయితో పోలిస్తే 2013-14 నాటికి ప్రాజెక్టు వ్యయం పెరగడానికి గల కారణాలను విపులీకరించారు. ఇదివరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ. 2,934 కోట్లు అవుతుందని అంచనా వేయగా 2013 భూసేకరణ చట్టం నేపథ్యంలో ఆ వ్యయం రూ. 33,225 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఈ ఒక్క వ్యయమే 1,132. 27% పెరి గినట్లు తెలిపారు. కాలువలు, హెడ్ వర్క్ నిర్మాణ పనుల్లో ఇంత అసాధారణ స్థాయిలో పెరుగుదల లేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చులనూ సకాలంలో ఇప్పించాలని కోరారు. 2018 ఫిబ్రవరి వరకు రూ. 8,065 కోట్లు ఖర్చుచేస్తే రూ. 5,342 కోట్లు చెల్లించారని, ఇంకా రూ. 2,723 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. ఈ డబ్బు త్వరగా ఇప్పిస్తే ప్రాజెక్టు పనులు మరింత వేగంగా పూర్తి కావడానికి వీలవుతుందన్నారు.