చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు.. అంతా అయిపోయాక ఇప్పుడు తల్చుకుని బాధపడుతున్నారు.. దౌత్యం చేయమని అడుగుతున్నారు.. చేయి దాటిపోయాక బాధపడి ప్రయోజనం ఏముంటుంది? కొంతమంది కేంద్రమంత్రులకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. చంద్రబాబుతో మాట్లాడాలనీ, మధ్యవర్తిత్వం వహించాలనీ కొంతమంది కేంద్ర మంత్రులు తెలుగుదేశం ఎంపీలను అడుగుతున్నారు. రాయబారం దశ దాటిపోయిందని చెబుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గట్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో ఆయన విజయవాడకు వచ్చి కృష్ణానదిలో ఏర్పాటుచేసిన భారీ ఫంట్ను ప్రారంభించి, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారంటూ సమాచారం అందింది.
ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పక్షాన కేంద్రమంత్రిని ఎవరు ఫాలో అవుతారని జలవనరుల శాఖ అధికారులు ఆరాతీశారు. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇంకెవరు వస్తారంటూ మళ్లీ ప్రశ్నించారు. ఇంకెవరూ రారు అని సిఎంవో తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తారని గట్కరీ ఆశించారని చెబుతున్నారు. అయితే సీఎంకి ముందుగా పర్యటనలు ఖరారు కావడంతో ఆయన హాజరుకాబోరని సిఎంవో వర్గాలు తేల్చిచెప్పాయి. కనీసం పోలవరం సమీక్షకు అయినా సీఎం హాజరైతే బాగుంటుందని భావించారు. కానీ ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి కూడా హజరయ్యే అవకాశం లేదని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందింది. దీంతో చివరి నిముషంలో నితిన్ గట్కరీ పర్యటన వాయిదా పడిందంటూ సమాచారం అందించారు.
రాష్ట్రంలో హోదా కోసం ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో గట్కరీ పర్యటనకు వెళితే బాగోదని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న గట్కరీ తన పర్యటనను స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉన్నాయన్న సాకుతో వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సహజంగా ఆదివారం ఢిల్లీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగే అవకాశమే లేదు. ఇలా కేంద్రమంత్రులు నలుగురైదుగురు తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం పట్ల తెగ బాధపడిపోతున్నారు. కొంతమంది చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కూడా కేంద్రమంత్రులతో పాలనాపరమైన వ్యవహారాలు మినహా మిగతా రాయబారాలను అంగీకరించడం లేదు.