పచ్చటి ప్రకృతి ఒడిలో... సర్వాంగ సుందరంగా.... నవ్యాంధ్ర రాజధాని మంగళగిరిలో... నిర్మించిన ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించి 10 నెలలు కాక ముందే, దాని పక్కనే, ఇప్పుడు పోలీసు టెక్ టవర్ రెడీ అయ్యిపోయింది... రాష్ట్ర పోలీసు శాఖకు ప్రధాన కేంద్రంగా మారిన ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మరో అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంది. బెటాలియన్ ఆవరణలో పూర్తి ఈశాన్యంగా టెక్ టవర్ పేరుతో బ్రహ్మాండమైన ఏడంతస్తుల భవనం నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. సుమారు రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనికి సమీపంలోనే రూ.40కోట్ల వ్యయంతో పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయ భవనం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.
ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో మేజర్‌గా టెక్ సర్వీస్ వింగ్.., ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, అక్టోపస్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితర వాటికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందులోని ఏడంతస్తులలో తొలి నాలుగు అంతస్తులను కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్స్‌కు, ఆపై మూడంతస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్ సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ఒక్కో అంతస్తును 8500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు.
రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లను ఈ సాంకేతిక సౌధంతో అనుసంధానించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించేందుకు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ అండ్ స్టాండర్డైజేషన్, పోలీసు కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్స్‌లను (పీసీవో) ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పోలీసులు కొంత వరకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారని, సర్వలెన్స్ కెమెరాలు, లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టం.. ఇవన్నీ ఉపయోగించుకోవడంవల్ల దొంగతనాలు, క్రైమ్‌ను నియంత్రణ చేసే అవకాశం ఉంది...