అగ్రిగోల్డ్ వ్యవహరం మళ్లీ మొదటికి రావడానికి వైసీపీనే కారణమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… అగ్రిగోల్డ్ వ్యవహరంలో వైసీపీపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టేకప్ చేయడానికి ముందుకొచ్చిన జీ-ఎస్సెల్ గ్రూప్.. వైసీపీ వల్లే వెనక్కు వెళ్లిందన్నారు. కేంద్రం మా చేతిలో ఉంది అంటూ సీబీఐ కేసుల పేరుతో జీఎస్సెల్ గ్రూప్‌ను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ విషయాన్ని జీ-ఎస్సెల్ కంపెనీ ప్రతినిధులే స్వయంగా వెల్లడించారని తెలిపారు. ‘బాధితులకు న్యాయం జరగాలని ఏపీలో ఆందోళనలు చేస్తారు.. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరపాలని ప్రధాని మోడీని అడుగుతారు..’ అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
18 లక్షల మంది అగ్రిగోల్డ్ లబ్దిదారుల ఉసురు వైసీపీకి తగులుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. కేసుల పేరుతో జీ గ్రూపును వైసీపీయే బెదరగొట్టిందన్నారు. వైసీపీ రాక్షస క్రీడవల్లనే అగ్రిగోల్డ్ వ్యవహారం నిలిచిపోయిందన్నారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటామని, వైసీపీ బెదిరింపులకు సంబంధించిన అన్ని విషయాలనూ త్వరలో బయటపెడతామని కుటుంబరావు చెప్పారు. ఈ విషయం కోర్ట్ లో ఉన్నందున, అవసరం అయితే, ఈ ఆధారాలు కోర్ట్ కి కూడా ఇస్తామని అన్నారు... అగ్రిగోల్డ్ కేసు వచ్చే సోమవారం హైకోర్టులో విచారణకు రానుండగా ఈలోపే కొందరు రా ష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు..
తప్పుదోవ పట్టించేలా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తును తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఎస్సెల్ గ్రూప్‌పై కోర్టు ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని ఎస్సెల్ గ్రూప్ తెలిపిందని, సీఐడీ ఎప్పటికప్పుడు వివరాలను కోర్టుకు సమర్పించిందన్నారు. వచ్చిన బిడ్డర్లను వైసీపీ నాయకులు భయపెట్టి వెనక్కి పంపారని కుటుంబరావు ఆరోపించారు. ఈనెల 16న జరిగే కేబినెట్ బేటీలో చర్చించిన తర్వాత అగ్రిగోల్డ్ వ్యవహారంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.