సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు... బ్రిటన్‌ మాజీ ప్రధాని, ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్’ నిర్వాహకుడు టోనీ బ్లెయిర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒకప్పటి తన హైదరాబాద్‌ సందర్శనను, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా‌లోని ఓ గ్రామాన్ని పరిశీలించిన వైనాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కొత్త రాష్ట్రం ఎలా ఉందని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్న తీరు తనకు తెలుసునని టోనీ పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో భూములు ఎలా అందించిందీ టోనీ బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. 

blair 13042018 1

పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వచ్చే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న వైనం, ఫైబర్ కనెక్టివిటీ, ఆహారశుద్ధి రంగంలో ఏపీలో ఉన్నఅపార అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం 50 శాతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ప్రతి కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకునేందుకు బ్లెయిర్ ఆసక్తి కనబరిచారు. ఎప్పుడైనా భారతదేశం వెళ్లినప్పుడు ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తనకు చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చానని తెలిపారు.

blair 13042018 1

నూతన రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి విజన్‌తో ముందుకెళ్తున్నారని చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా పాలన వ్యవస్థలో అమలు చేసే ఉత్తమ విధానాలపై బ్లెయిర్‌ నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థ దృష్టి నిలిపింది. రియల్‌టైమ్ గవర్నెన్స్, కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విద్యుత్ సంస్కరణలు, సౌర, పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏపీ సందర్శనకు‌ ఆసక్తి కనబరిచారు. భారత్‌లో ఇప్పటికే తమ సంస్థ 200 విద్యాలయాలతో కలిసి పనిచేస్తోందని.. ఏపీతోనూ కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ముందుగా తమ బృందాన్ని పంపించి తరువాత తాను వస్తానని టోనీ బ్లెయిర్‌ చంద్రబాబుకు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read