కేంద్ర ప్రభుత్వం నాలుగో బడ్జెట్‌లో కూడా ఏపీకి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటేనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని, అది కూడా సరిగా అమలు చేయలేదని సీఎం అన్నారు. కేంద్రం మోసం చేసిందని తెలిసే తిరుగుబాటు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. పార్లమెంటు సరిగా జరగలేదని ప్రధాని మోదీ నిరాహార దీక్ష చేస్తామని అంటున్నారని, ప్రజల మనోభావాలతో మోదీ ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో వైసిపీ పై పంచ్ వేసారు... వైకాపావి రాజీనామాలు కాదని, మోడీతో రాజీపడి ప్రజలకు నామాలు పెట్టారని చంద్రబాబు నాయుడు పంచ్ వేసారు... తన మీద కక్షతో రాష్ట్రం మీద దాడి చేసే పరిస్థితికి భాజపా వచ్చిందని సీఎం మండిపడ్డారు. తెలుగుదేశం సహకారం లేకుంటే రాష్ట్రంలో భాజపా ఎక్కడుందని ప్రశ్నించారు... రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం రాజీ పడబోమని భాజపాకు అర్థమైనందునే కేసులున్న వారిని చేరదీశారని విమర్శించారు. అలా చేరదీస్తే తమ చెప్పుచేతల్లో జగన్ ఉంటాడన్నది భాజపా ఎత్తుగడ అని వివరించారు. కక్ష సాధింపు కోసం అవినీతి పార్టీనిభాజపా అక్కున చేర్చుకుందన్న చంద్రబాబు ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
ఈనెల 30న తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా...గతంలో మోదీ చెప్పిన మాటలను గుర్తు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రంపై ఎలాంటి పోరాటాలకైన సిద్దమన్నారు. అమరావతికి అన్ని ఇస్తామని తిరుపతిలో చెప్పిన మోదీ... ఇప్పుడు మాట తప్పారని, టీడీపీపై బురద జల్లుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు టీడీపీయే గెలవాలని, అప్పుడే కేంద్రంలో మనమనుకున్న ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో రాజీ పడే వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామా ఆడారని, ఏపీ ప్రజలకు వైసీపీ ఎంపీలు నామాలు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.