ప్రధాని నరేంద్ర మోదీ చేస్తాను అంటున్న ఒక్క రోజు నిరాహార దీక్ష పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు... మోడీ దీక్ష చేస్తాను అనటం ప్రజల దృష్టి మరల్చడానికేనని చంద్రబాబునాయుడు ఆరోపించారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఆనంద నగరాల సదస్సుకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చిన విందు సమయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. విపక్షాలు పార్లమెంటు సమావేశాలు జరగనీయకపోవడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 12న భాజపా ఎంపీలతో పాటు మోదీ కూడా దీక్షలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. పార్లమెంటు సజావుగా సాగకపోవడానికి ఎన్డీయేనే కారణమని ఆయన ఆరోపించారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండేందుకు అన్నాడీఎంకే పార్టీ వెనుక ఉండి లోక్సభ జరగనీయకుండా చేసింది ఎన్డీయే కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాన్ని ఏర్పాటు చేయకుండా మోదీని ఎవరు ఆపారు’ అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల వివాదం పరిష్కరించేందుకు కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభలో ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు జరగకపోవడంపై తప్పు తమ వైపు పెట్టుకుని ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కేంద్రం సాయం కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు సెక్టార్ సహాయంతో రాజధాని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇతర పార్టీలతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్లో తెదేపాను బలహీనం చెయ్యాలని చూస్తున్నారు. కానీ, తెదేపా చాలా బలమైన పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు. మరో పక్క ఉదయం, విజయవాడ: మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. కేంద్రంతో విభేదాలు ఉన్నంత మాత్రాన సంక్షేమం, అభివృద్ధి ఆగదని, మోదీ ఏపీకి సాయం చేయకపోతే కేంద్రం నుంచి వడ్డీతో సహా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసని సీఎం చంద్రబాబు తెలిపారు.