కడప,నెల్లూరు, ప్రకాశం, అనంతపురము, విజయనగరం జిల్లాలలో కరువు నుంచి ఉపశమన చర్యలకు రూ. 680 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అదనంగా సాయం అందించాలని కోరారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ఒక్కోసారి ప్రకృతి సహకరించకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని చెప్పారు. కరువు పరిస్థితులపై పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు నాలుగు జిల్లాల పర్యటన అనంతరం గురువారం ముఖ్యమంత్రితో సమావేశమైంది.
తాము 5 జిల్లాల్లోని మొత్తం 121 మండలాల్లో పర్యటించామని వాటిలో ప్రకాశం జిల్లాలో పరిస్థితులు ఒకింత ఆందోళన కరంగా ఉన్నాయని కేంద్ర బృందం సభ్యులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, తాగునీటి, పశుగ్రాస సమస్యలు కూడా అధికంగా ఉన్న విషయాన్ని గమనించామని చెప్పారు. అదే సమయంలో కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. రేషన్, పెన్షన్లు అందించేందుకు అవలంబిస్తున్న విధానాలు తమనెంతో ఆకట్టుకున్నాయని, కరువు మండలాల్లో ఉపాధి హామీ పధకం పనులు జరుగుతున్న తీరు చాలా బాగుందని ముఖ్యమంత్రికి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరవు, తుఫాన్లు రెండూ ఎదుర్కొనాల్సిన విచిత్ర పరిస్థితులు వున్నాయని కోస్తాంధ్రను తుఫాన్లు, రాయలసీమను కరవు పీడిస్తున్నాయని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి వివరించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలను నిలువరించలేని పరిస్థితులు తలెత్తున్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని కరవు బారి నుంచి కాపాడటానికి విస్తృత చర్యలు చేపట్టాము, పెద్ద సంఖ్యలో పంటకుంటలు తవ్విన విషయాన్ని తెలిపారు. వర్షాభావ పరిస్తితులవల్ల పంట కుంటల్లో నీటి నిల్వలు చేరలేదన్నారు.
పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించకుంటే చివరికి కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా బీడు వారేవని ముఖ్యమంత్రి అన్నారు. సాధ్యమైనంత త్వరగా వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు పనిచేస్తున్నామని, టన్నెల్ పనులు పూర్తి అయితే ప్రకాశం జిల్లాను శాశ్వతంగా కరవు బారినుంచి కాపాడుకోగలుగుతామని అన్నారు. కరువు వచ్చినప్పుడే నివారణ చర్యల గురించి ఆలోచిస్తున్నామని, కానీ శాశ్వత ప్రాతిపదికపై ఈ సమస్యను అధిగమించాలని దీనికి రాష్ట్రాలకు కేంద్ర సాయం అవసరమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను కేంద్రానికి వివరించి ఏపీని ఉదారంగా ఆదుకునేలా చూడాలని బృందం సభ్యులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.