ప్రధాని పదవో... సీఎం సీటో అడగలేదే... మరో పదివో అడగలేదు... టీ అడగలేదు.. పకోడీ అడగలేదు... కాని బయటకు గెంటేసారు... ఇది, సంఘ్ పరివార్‌తోనూ సన్నిహితంగా పని చేసిన 62 ఏళ్ల ప్రవీణ్ తొగాడియా మాటలు... ప్రధాని నరేంద్ర మోదీతో తనకెలాంటి వివాదాలు లేవని, కేవలం రామాలయం నిర్మాణానికి సంబంధించి చట్టం చేసే విషయంలోనే మోడీతో సమస్య అని అన్నారు తొగాడియా... తాను ఎలాంటి పదవులు కోరుకోకుండానే నాలుగు దశాబ్దాల పాటు సంఘ్ పరివార్‌కు సేవలందించానని, తానే కోరుకుని ఉంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడినని అన్నారు.. 'మోదీతో నాకు వివాదాలే ఉండుంటే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యిండేవారు కాదు' అని మోదీపై ప్రవీణ్ తొగాడియా నిప్పులు చెరిగారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అమలు తదితర డిమాండ్లపై ప్రవీణ్ తొగాడియా పల్డిలోని వీహెచ్‌పీ కార్యాలయం ముందు మంగళవారంనాడు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయనతో పాటు వీహెచ్‌పీ రాష్ట్ర చీఫ్ కౌషిక్ మెహతా, ప్రధాన కార్యదర్శి రాంచోడ్ భార్వాడ్, సుమారు 200 మంది సాధువులు, మద్దతుదారులు పాల్గొన్నారు. 'ఒక ప్రధాని హిందువుల వల్ల అధికారంలోకి వచ్చి గోరక్షులను గూండాలని పిలవడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు' అంటూ మోదీపై తొగాడియా విమర్శలు గుప్పించారు.
తొగాడియా మాట్లాడుతూ మోదీపై నిశిత విమర్శలు చేశారు. తానే అప్పట్లో కోరుకుని ఉంటే మోదీకి సీఎం పదవి కూడా దక్కేదికాదని అన్నారు. 'నా జీవితంలో 50 ఏళ్లుగా హిందువుల సంక్షేమానికి పాటుపడుతూ వచ్చాను. అయినప్పటికీ నన్ను బయటకు నెట్టారు. ఎందుకోసం?...నేనేమీ పదవులు అడగలేదు. ప్రధాని పదవి ఇమ్మనలేదు. ఒక సంచీ టీ, పకోడా వేయించుకునే బూలిమూకుడో అడగలేదు. కేవలం రామ మందిరం నిర్మించాలని అడిగా. అందే అంశంపై ఆయన (మోదీ) ప్రధాని అయ్యారు' అని తొగాడియా అన్నారు.