విజయవాడ- గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు.. నవ్యాంధ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైనది. రాజధాని ప్రాంతమైన విజయవాడలో నానాటికీ తీవ్రమవుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చటంతోపాటు, రాజధాని అమరావతిని ఉభయ గోదావరి జిల్లాలతో అనుసంధానం చేసే ‘విజయవాడ-గుండుగొలను’ రోడ్డు ప్రాజెక్టుకు మోక్షం కలగటం లేదు. విజయవాడ - గుండుగొలను రోడ్డు ప్రాజెక్టును బీఓటీ కింద కాంట్రాక్టు సంస్థ గామన్ తలకెత్తుకున్న దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు పరిస్థితి అతీ గతీ లేకుండా పోయింది. విజయవాడ - గుండుగొలను ప్రాజెక్టులో భాగంగా కాజ నుంచి పెద అవుటపల్లి వరకు విజయవాడ జంక్షన్, మధ్యలో కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి వరకు ఒక పార్ట్ పెద అవుటపల్లి నుంచి జంక్షన్ వరకు జాతీయ రహదారి విస్తరణ, జంక్షన్ నుంచి గుండుగొలను వరకు జంక్షన్ బైపాస్‌లు అంతర్గత ప్రాజెక్టులుగా ఉన్నాయి.
అప్పట్లో ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,645 కోట్లు. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే అతి ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టు ఇది! ఏళ్ల తరబడి గామన్ సంస్థ పనులు చేయలేకపోవటంతో ఈ ప్రాజెక్టును రద్దు చేయటానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు దీని వెనుక కూడా కేంద్రం కుట్ర దాగి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. విజయవాడ-గుండుగొలను రోడ్డు నిర్మాణాన్ని కావాలనే ఆపుతున్నారా? టెండర్ల దశలో అవకతవకలు, డీపీఆర్ తయారీ కన్సల్టెన్సీల ఎంపిక జాప్యంలో కుట్ర దాగి ఉందా? అంటే పరిస్థితులు అవుననే సమాధానాన్నే ఇస్తున్నాయి. అన్నీ సవ్యంగానే ఉన్నా టెండర్లు ఖరారు చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం, ఎన్‌హెచ్ అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడం ప్రాజెక్టును సందిగ్ధంలోకి నెట్టింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి సకాలంలో కన్సల్టెన్సీలను పిలవటం మొదలుకుని, టెండర్ల తతంగం, వాటిని ఖరారు చేసే విషయం వరకు విపరీతమైన జాప్యం జరుగుతోంది. అన్నీ సవ్యంగానే ఉన్నా వాటిని ఖరారు చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందంటే సమాధానం లేని ప్రశ్నగా మారింది. విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో పార్ట్-1గా ప్యాకేజీ-1, 2 పనులకు పిలిచిన టెండర్లు నేటికీ ఖరారు కాలేదు. పార్ట్-2 గా ప్యాకేజీ-3, 4 లకు సంబంధించి డీపీఆర్‌ల తయారీకి కన్సల్టెన్సీలనే ఎంపిక చేయలేదు. ఏమీ చెప్పలేక మౌనం వహిస్తున్న జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) అధికారులను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. జాతీయ రహదారుల సంస్థకు కేంద్రం నుంచి స్పష్టమైన మౌఖిక ఆదేశాలు వచ్చినందునే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.