ఇప్పటి వరకు, 15వ ఆర్థిక సంఘం విషయంలో, నిధుల విషయంలోనే అన్యాయం జరుగుతుంది అని అందరూ భావించారు.. నిన్న జరిగిన 7 రాష్ట్రాల సమావేశంలో, దక్షిణాది రాష్ట్రాలని ముంచేసే మరో కుట్ర కూడా చర్చలోకి వచ్చింది. 15వ ఆర్థిక సంఘం 2011, జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని, దక్షినాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ విషయంలో మాత్రమే కాదు, ఇదే జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని, భవిష్యత్తులో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకూ ఆ లెక్కల్నే పరిగణనలోకి తీసుకుంటాయని, నిన్నటి సమావేశం అభిప్రాయ పడింది. ఇది జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
‘దక్షిణాదిలో ఇప్పుడు 100 లోక్‌సభ స్థానాలున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే వీటి సంఖ్య 70కో, 50కో పడిపోతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల గొంతు ఈ మాత్రం కూడా వినపడదు. ఈ రాష్ట్రాలను ఎవరూ పట్టించుకోరు’ అని చంద్రబాబు వాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం నుంచే రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బతీయడం మొదలైందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాడటం తెదేపాకు కొత్త కాదని, ఎన్టీఆర్ హయాంలోనే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పోరాటం సాగించామని చంద్రబాబు తెలిపారు. దాని ఫలితంగానే సర్కారియా కమిషన్ ఏర్పాటైందని చెప్పారు.
ఈ రోజు జరిగుతున్న కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ విషయంలో కూడా చంద్రబాబు ఈ విషయం ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం తీరును గమనిస్తే మరింత బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటాననడం విచారకరమన్నారు. జనాభా నియంత్రణ కోసం నాడు తెదేపా హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించామన్నారు. 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం వుందన్నారు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుందని, కొత్త ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు మరింత నష్టం కలుగుతుందన్నారు. అటు విభజన వల్ల, ఇటు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు.