ఆగష్టు ఒకటితో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుందని,ఆ గడువు లోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి , రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్రానికి లేఖ రాసారు. ఈ నెల 15 నుండి పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని అందులో సూచించారు. జూన్ 25 నాటికి వార్డులు వారీగా రిజర్వేషన్లు ప్రకటించాలని, జులైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని పేర్కొన్నారు. నెలరోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రమేష్ కుమార్ సూచించారు. అయితే, ఈ రోజు పంచాయతీల వారీగా ప్రదర్శించాల్సిన ఓటర్ల జాబితాలు మరో నెలరో జులు వాయిదా పడ్డాయి. ఎన్నికల కార్యాచరణలో మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడంతో మంగళవారం ప్రదర్శించాల్సిన ఓటర్ల జాబితా ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి జూన్ 15న ఈ జాబితాలు ప్రదర్శించనున్నారు.
పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు తగిన విధంగా రాష్ట్రంలో కసరత్తు జరుగుతుండగా ఈ ప్రక్రి య నెల రోజులు వాయిదా పడింది. దీనిలో తొలి అంకమైన ఓటర్ల జాబితా ప్రచురణ ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న అన్ని పంచాయతీల్లో వార్డుల వారీగా ప్రదర్శిం చాల్సి ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు దాదాపు అన్ని పంచాయతీల్లోనూ పూర్తయ్యాయి. జాబి తాలు ప్రదర్శించేందుకు అధికారులు సిద్ధమ వుతుండగా సోమవారం కార్యాచరణలో చేర్పులు, మార్పులు చేస్తూ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పంచాయితీ ఎన్నికలు, జూలై నేలాఖరులో కాని, ఆగష్టు రెండో వారం లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం ముగిశాక అన్ని పంచాయితీలకు స్పెషల్ ఆఫీ సర్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఆగస్టు ఒకటితో పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తోంది. అంటే రెండు నుంచి కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికలు జరిగితేనే అందుకు అవకాశం ఉంటుంది. దీనిపై సందిగ్ధం నెలకొనడంతో పంచాయితీలలో హడావుడి మొదలైంది. డీపీవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, "వార్డుల వారీగా పంచాయతీ ఓటర్ల జాబితాలు జూన్ 15న విడుదల చేస్తాం. ఈ నెల 15న ప్రచురించాల్సిన జాబితాలను నెల రోజుల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. షెడ్యూల్లో స్వల్పంగా చేర్పులు, మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామాజిక స్థితి నమోదుతోనే ప్రచురణ చేయడం జరిగేది. ఈ సారి కేవలం ఓటర్ల జాబితాలు మాత్రమే పంచాయతీల్లో ప్రదర్శించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు జిల్లాలో ఓటర్ల జాబి తాలు తయారు చేస్తాం." అని అన్నారు.