కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కన్నడ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల ప్రకారం భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. సాధారణ మెజార్టీకి కొద్ది స్థానాల దూరంలోనే భాజపా నిలిచిపోయిన నేపథ్యంలో కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జేడీఎస్ అగ్రనేతలతో మంతనాలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి కోరనున్నారు. గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారనుంది. జేడీఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. జేడీఎస్‌కు బయటి నుంచి మద్దతిచ్చే దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధ్యక్షుడు దేవగౌడతో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఫోన్లో మాట్లాడినట్లుగా తెలియవచ్చింది.
ఈ నేపధ్యంలో రెండు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసేందుకు వెళ్ళగా, గవర్నర్ అపాయింట్‌మెంట్ దక్కలేదని తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రతినిథి వర్గం గవర్నర్ విజుభాయ్ వాలాను కలిసేందుకు ప్రయత్నించింది. జీ పరమేశ్వర నేతృత్వంలోని ఈ బృందానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేనట్లు తెలుస్తోంది. దీంతో ఈ బృందం తిరిగి వెనుకకు వచ్చేసినట్లు సమాచారం. మరో పక్క, ఇప్పటికీ బీజేపీ, అధికారంలోకి వచ్చేది మేమే అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పటం, ఆశ్చర్యం కలిగిస్తుంది.. మరే బీజేపీ నేతలు, కాంగ్రెస్ నుంచి చీలుస్తారా, జేడీఎస్ నుంచి చీలుస్తారా అనేది చూడాల్సి ఉంది... మొత్తానికి, ఈ ఎపిసోడ్ అయ్యేదాకా, గవర్నర్ కీలకం కానున్నారు.. కొంత మంది గవర్నర్లు లాగా కేంద్రం చెప్పినట్టు ఆడతారా, స్వతంత్రంగా పని చేస్తారా అనేది చూడాలి..