ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల సందర్శనకు ముఖ్యమంతి చంద్రబాబు వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితులను తెలుసుకునేందుకు విశ్వవిద్యాలయాలను సందర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్సిటీలను సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విశ్వవిద్యాలయాలకు పంపించింది. వచ్చే నెల 22 నుంచి ప్రారంభమయ్యే సీఎం పర్యటన డిసెంబరు 28న చిత్తూరుతో ముగియనుంది. ఉన్నత విద్యలో ప్రపంచ పోటీ, ప్రపంచంలో వస్తున్న మార్పులపై విద్యార్థులతో సీఎం మాట్లాడనున్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లే సమయంలోనే వర్సిటీలను సందర్శించనున్నారు.
రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం దార్శినికతకు అనుగుణంగా వర్సిటీలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ దిశగా సాగుతున్న వర్సిటీల ప్రగతి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో సీఎం తెలుసుకోనున్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థులు, క్యాంపస్ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వర్సిటీల ఉపకులపతులు సమావేశాలకు అవసరమైన చర్యలు చేపట్టారు. ముందుగా జూన్ 22న శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్లనున్నారు, జూలై 6న విజయనగరంలో ఉన్న జేఎన్టీయూ, ఆగష్టు 3న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలకు వెళ్తారు.
ఆగష్టు 17న పశ్చిమ గోదావరి జిల్లాలోని వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ, సెప్టెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, సెప్టెంబర్ 17న కృష్ణా జిల్లాలోని, ట్రిపుల్ ఐటి, కృష్ణా యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ, అక్టోబర్ 3 న గుంటూరులోని, నాగార్జునా యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యావసాయి యూనివర్సిటీ, నవంబర్ 2 న నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ, నవంబర్ 16న అనంతపురంలోని జేఎన్టీయూ, శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ, నవంబర్ 30న కర్నూల్ లోని రాయలసీమ యూనివర్సిటీ, డిసెంబర్ 14 న, కడపలోని యోగి వేమన యూనివర్సిటీ, డిసెంబర్ 28 న, చిత్తూరులోని, శ్రీ వెంకటేశ్వర, శ్రీ పద్మావతి మహిళా, ద్రావిడ యూనివర్సిటీలను సందర్శిస్తారు...