తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా తొలగించబడిన తరువాత రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలపై టీటీడీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆలయ ప్రతిష్ఠను దిగజార్చేలా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, ఉద్యోగులు మూకుమ్మడి నిరసనకు దిగారు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. దేవాలయంలో స్వామికి సకాలంలో నైవేద్యం పెట్టడం లేదని, పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరగడం లేదని, స్వామి సంపదను అధికారులు కొల్లగొడుతున్నారని, నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కావాలనే ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
అలాగే, రేపు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు విధులు బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకుని తీర్మానం చేశాయి. తిరుపతి పరిపాలన భవనంలో అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై చర్చించి నర్ణయం తీసుకున్నారు. అర్చకులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులు నిర్వర్తిస్తున్న నిరసనకు, ఇది తోడు. ఈ నిరసనా పై, టిటిడి ఉద్యోగులు మాట్లాడుతూ రమక్ష దీక్షితులు పాలకవర్గంపై కక్షతో తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలు మాయం అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తద్వారా తితిదే ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మాట్లాడని రమణ దీక్షితులు ఇప్పుడెందు ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు అర్థమైందన్నారు. కావాలనే ఇలా చేయడం ద్వారా తితిదే ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని వారు రమణ దీక్షితులకు విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో ఆలయ పవిత్రతను దిగజార్చేలా రమణ దీక్షితులు ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. టీటీడీలో పరిపాలన తీరు బాగోలేదని, అవినీతి జరుగుతోందని, గులాబీ వజ్రం పోయిందని తీవ్ర ఆరోపణలు చేస్తోన్న రమణ దీక్షితులు నిన్న ఢిల్లీకి సైతం వెళ్లి పలువురు బీజేపీ నేతలతో కూడా చర్చించారు. బీజేపీ ఈ విషయం పై, వెనుక ఉండి నడిపిస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా, బీజేపీకి చెందిన ఒక నేషనల్ మీడియా ఛానల్ కూడా, ఈ విషయం పై విషం చిమ్మింది. తిరుమల వ్యవహారాలు ఎన్నడూ లేనంతగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే భక్తులు ఆందోళన చెందుతున్నారు.