ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల బాట పట్టిస్తామని, ఇందుకు కావాల్సిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని సంస్థ ఎండీ సురేంద్రబాబు తెలిపారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసి పై ఆర్థిక భారం పడుతున్నా బస్ ఛార్జీలు పెంచబోమని ఆర్టీసి ఎమ్‌డి ఎన్వి సురేంద్ర బాబు వెల్లడించారు. ఎమ్‌డిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసి హౌస్‌లో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నష్టాలు వచ్చే బస్సు సర్వీసులున్నా ప్రజలకు సేవలందించా లనే ఉద్దేశంతో లాభాలు ఆశించకుండా సర్వీసులను నడుపుతున్నామన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధుల ద్వారా 850 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించామని, వాటిలో 700 బస్సులను పాత సర్వీసుల స్థానాల్లో భర్తీ చేస్తామని తెలిపారు. సంస్థ ఆస్తులను ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడు తున్నామని, ఇప్పటికే 300 ఎకరాలు గుర్తించా మని వివరించారు. డిమాండ్‌లేని రోజుల్లో తక్కువ ఛార్జీ, డిమాండ్ ఉన్న రోజుల్లో ఎక్కువ ఛార్జీతో బస్సులు నడిపేలా ఫ్లెక్సిబుల్ ఫేర్ విధానంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సిబ్బంది సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని, సెలవుల విషయంలో సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సిబ్బందికి సెలవులు ఇచ్చినా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సర్వీసు నుంచి తొలగించిన వారిని, రిటైరై పనిచేసే సామర్థ్యం ఉన్నవారిని, ఆసక్తి ఉన్న ఇతరులను ఆన్‌కాల్ పద్ధతిలో తీసుకుని సర్వీసులను నడపాలని నిర్ణయించామన్నారు. రిటైర్ అయిన వారికి అదే రోజు బెనిఫిట్స్ అన్నీ అందేలా చర్యలు తీసుకున్నామని, జూన్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. 2600 పెన్షన్లు, 4100 మందికి వివిధ బకాయిలు, 1100 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. 70 శాతం మంది సిబ్బందికి ఏదో ఒక ఛార్జ్‌షీట్ ఇచ్చారని, అనవసరంగా ఛార్జిషీట్ ఇవ్వకుండా అందుకు విధివిధానాలు రూపొందించామని, పాత వాటిని విచారించి అనవసరంగా ఇచ్చిన వాటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని యోచిస్తున్నామని, బస్ షెడ్యూళ్లను పరిశీలించి డిమాండ్‌ను బట్టి సర్వీసులను నిర్ణయిస్తామని తెలిపారు.
ఈ పరిశీలనను మంగళగిరి డిపోలో ప్రయోగాత్మకంగా చేపట్టామని, రెండు నెలల్లో అన్ని డిపోల్లో చేపడతామని తెలిపారు. గతేడాది ఏప్రిల్, మేతో పోలిస్తే ఈ ఏడాది ఆక్యుపెన్సీ రేషియో పెరిగిం దన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తానే నేరుగా మాట్లాడుతున్నానని, ఆలస్యంగా నడుస్తున్న సర్వీసుల గురించి పరిశీలించి ఆపరేషన్స్ మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలావారీ పాస్‌ల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వార్షిక పాస్‌లను ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నామన్నారు. అన్ని బస్సు లనూ ట్రాకింగ్ సిస్టంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతేడాది రూ.5500 కోట్లు ఆదాయం వచ్చిందని, అందులో రూ.4500 కోట్లు ట్రాఫిక్ ఆదాయం, రూ.400 కోట్లు నాన్ ట్రాఫిక్, రూ.600 కోట్లు రీప్లేస్మెంట్ ద్వారా వచ్చిందని, నాన్ట్రాఫిక్ ఆదాయాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. గతంలో రూ.790 ఉన్న నష్టాన్ని గతేడాది రూ.440 కోట్లకు తగ్గించగలిగామని, పిఆర్సి వల్ల ఈ ఏడాది కొంత భారం పడే అవకాశం ఉందని అన్నారు. ఆస్తుల విభజన చివరి దశకు చేరుకుందని, కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. లాస్ట్ మైల్ కార్గో ఆలోచన ఇప్పట్లో లేదని, ఏఎన్ఎల్ ఉన్నప్పుడు ఏడాదికి రూ.తొమ్మిది కోట్లు ఆదాయం వచ్చేదని, కార్గో సర్వీస్ ద్వారా 43 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. డీజిల్ ధరలో పన్ను మినహాయించాలని ప్రభుత్వాన్ని గతేడాదే కోరామన్నారు. తిరుపతిలో ఆర్టీసి రీజినల్ ఆస్పత్రి నిర్మించాలనే ఆలోచన ఉందని తెలిపారు.