అత్యంత వృద్ధి రేటు నమోదు చేస్తున్న ఆక్వారంగానికి మరింత ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో దఫా ప్రోత్సాహం ప్రకటించారు. ఆక్వాసాగుకు వినియోగించే విద్యుత్‌పై సబ్సిడీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు యూనిట్‌ రూ. 2కే విద్యుత్ సరఫరా చేస్తామని రొయ్యల మార్కెట్ ధర స్థిరీకరణపై ఆక్వారంగ భాగస్వాములతో శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వరాన్ని ఇచ్చారు. ఆక్వారంగానికి ఇప్పటికే సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇకపై ఇచ్చే అదనపు సబ్సిడీతో రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. కోస్తాంధ్రలో ఆక్వారంగాన్ని, రాయలసీమలో ఉద్యానరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఆక్వా రైతు బావుండాలనే విద్యుత్ ధరలు తగ్గించామని చెప్పారు. విద్యుత్ సబ్సిడీపై హర్షం వ్యక్తం చేసిన రైతులు విద్యుత్ సబ్సిడీతో పాటు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం సంక్షోభంలో వున్నా ఆక్వారంగాన్ని ప్రాథమికరంగంగా గుర్తించి ప్రోత్సాహకాలు ఇస్తున్నారని ధన్యవాదాలు తెలియజేశారు.

aqua 26052018 2

సమావేశానికి వచ్చిన ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో గంటకుపైగా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఆక్వారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇష్టానుసారంగా యాంటి బయాటిక్స్ వినియోగించడం మంచిది కాదని, పర్యావరణహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టాలని సూచించారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాల్సి వుందన్నారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఆక్వాసాగు సరికాదని, అక్రమ సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకుండా, నష్టపోకుండా ముందే జాగ్రత్తపడాలని చెప్పారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. రొయ్యల ఫీడ్ ధరలపై ఉత్పత్తిదారులు - రైతులు ఒకరిని ఒకరు నిందించుకోకుండా సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు.

aqua 26052018 3

అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టారు... ఇన్ని సబ్సిడీలు ఇస్తున్నాం కాబట్టి, యాంటి బయాటిక్స్ వినియోగం తగ్గించమని కోరారు...ఆక్వారంగంలో యాంటి బయాటిక్స్ వినియోగంతో ఎగుమతులపై నిషేధం ఎదుర్కొనే ప్రమాదం వుందని, ఎట్టిపరిస్థితుల్లో యాంటి బయాటిక్స్ వాడేందుకు అనుమతిచ్చేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి రైతు కట్టుబడి వుండాలన్నారు. భూగర్భజలాలు కలుషితం కాకుండా మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్పత్తుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆక్వారంగాన్ని చిత్తశుద్ధితో పరిరక్షించుకోవాలని చెప్పారు. రైతులు ఇందుకు ముందుకువస్తే అన్నివిధాలా అండగా నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. తాత్కాలిక లాభాల కోసం ఏ ఒక్కరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా అందరూ నష్టపోతారని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ కోసం జోన్లువారీగా ఆక్వాసాగుకు అనుమతులు ఇస్తామని వెల్లడించారు. ఆక్వారంగంలో సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులు కొత్తగా మరికొన్ని దేశాలకు ఎగుమతులు చేసేలా ఎగుమతిదారులు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారు. దేశీయ మార్కెట్‌లోనూ మన ఆక్వా ఉత్పత్తుల విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆక్వా ఉత్పత్తుల నాణత్య నిర్ధారణకు అత్యాధునిక పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యేలా చూడాలని సమావేశంలో పలువురు రైతులు విన్నవించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read