సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం బాధితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 24 గంటల దీక్షకు సంఘీభావంగా రాజమహేంద్రవరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య, ఆకుల లక్ష్మీ పద్మావతి ఒక రోజు దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పవన్ కు మద్దతుగా కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా దీక్ష చేపట్టారు. జనాలు ఎక్కువుగా కనిపించటానికి, జిల్లా నుంచి అందరూ కాకినాడ తరలివచ్చి బలాన్ని చాటడంతో పాటు దీక్ష విజయవంతం చేసేందుకు కాకినాడలో కార్యక్రమం పెట్టారు. ఈ మేరకు పవన్ ఫాన్స్ అందరూ కాకినాడ వెళ్లి దీక్షలో పాల్గొన్నారు.
అయితే రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జనసేన పార్టీ కండువ మెడలో వేసుకుని బీజేపీ ఎమ్యెల్యే ఆకుల సత్యనా రాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మాతి, మరికొద్ది మంది మహిళామణులతో కలసి దీక్షలో కూర్చున్నారు. ముందుగా ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా ఒక్క సారిగా ఆమె జనసేన తరపున దీక్షలో కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆకుల లక్ష్మీ పద్మావతి మాట్లాడుతూ తనభర్త బీజేపీ ఎమ్మె ల్యేగా ఉన్నప్పటికీ తాను పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన తరపున దీక్షలో కూర్చున్నానన్నారు. దీనికి తన భర్త అడ్డు చెప్ప రని, దీక్షలో కూర్చున్న విషయం ఆయనకు చెప్పే వచ్చానన్నారు. అయితే ఇది వరకు, ఎప్పుడూ, ఈవిడ ఇలా చేసిన ధాకలాలు లేవు..
కాగా బీజేపీకి చెందిన రాజమహేంద్రవరం నగర శాసన సభ్యుడు ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రాజమహేంద్రవరంలో దీక్షలు చేపట్టడం పై జనసేన, బీజేపీ వర్గాలు విస్మయం చెందాయి. శనివారం గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర సమావేశం దృష్టికి వెళ్ళి నాయకులు మధ్య ఆంతరంగిక సమావేశంలో చర్చకు దారితీ సింది. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజకీయ భవితవ్యం పై ముందస్తు వ్యూహాలను బహిర్గతం చేసేందుకే తన భార్యను దీక్షకు పంపించారా అని ఆ పార్టీ నాయకులు సందేహపడుతున్నారు. మరో పక్క, జనసేన అయినా మనం చెప్పినట్టే ఉంటారుగా, ఏమి కాదులే అని, కొంత మంది బీజేపీ నేతలు అంటున్నారు.