తిరుమలలో ఒక వర్గం కుట్ర పన్ని చేస్తున్న ఆరోపణల పై ముఖ్యమంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో అర్చకులు ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న కొన్ని ముఖ్యాంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు 65 ఏళ్లకే పదవీవిరమణగా నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల్లో రేగిన అలజడిని, అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేసే నిర్ణయాలు వెల్లడించింది. రాష్ట్రంలోని అర్చకులందరికీ రిటైర్మెంట్ వర్తించదని, పే స్కేలు అమలుచేస్తూ, పెన్షన్లు ఇస్తున్న 11 పెద్ద ఆలయాల్లోని వారికే ఇది పరిమితమని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీటీడీ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించే టీటీడీలో రిటైర్మెంట్ విధానం అమలు చేసినట్లు పేర్కొంది. అర్చక సంక్షేమం, వారికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్షించారు.
విజయవాడలో అర్చక సంక్షేమ భవన్ నిర్మించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న అర్చకుల వారసత్వ హక్కు సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. రూ.2లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలపై దేవదాయశాఖ నియంత్రణ లేకుండా అర్చకులు, దాతలకే వదిలేసే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకే పదవీ విరమణ వయసు వర్తిస్తుందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత వారికి రూ.4లక్షలు గ్రాట్యుటీ వస్తుందన్నారు. దాతలు భూ సదుపాయం కల్పించిన ఆలయాలకు, కాంట్రాక్టు అర్చకులకు రిటైర్మెంట్ వర్తించదన్నారు. ఈ సమావేశంలో సీఎంవో కార్యదర్శి గిరిజా శంకర్, దేవదాయ కమిషనర్ అనూరాధ పాల్గొన్నారు.
అర్చక సంక్షేమ నిధి నుంచి వేతనాలు... సుప్రీం కోర్టు ఉత్తర్వులు, 2014 డిసెంబరులో ప్రభుత్వం ఇచ్చిన జీవో 417 ప్రకారం రూ.250 కోట్లతో నిధి ఏర్పాటు చేసి ఆ వడ్డీతో 1680 మంది ధార్మిక సిబ్బందికి కొందరికి రూ.10 వేలు, మరికొందరికి రూ.5 వేలు వేతనాలు చెల్లిస్తున్నాం. రూ.50 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాటిలో 1400 చోట్ల ధూపదీప నైవేద్యం పథకం కింద ఖర్చులు ఇస్తున్నాం... అర్చకులందరినీ చంద్రన్న బీమా కిందకు తీసుకొచ్చాం. వారు బీమా వసతి పొందుతున్నారు. అర్చక అకాడమీ ఏర్పాటైంది. సిలబస్ సిద్ధమయింది. పరీక్షలు నిర్వహించనున్నారు... చిన్న ఆలయాల్లో అర్చకులకు జీతాలు ఇచ్చిన తర్వాతే మిగిలిన సిబ్బందికి జీతాలు ఇవ్వాలనే నిబంధన పెట్టాం. ప్రతి చోట అసిస్టెంట్ కమిషనర్లు మచ్చుకు తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలి. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న చోట ప్రత్యేక కార్యక్రమాల సమయంలో అదనపు హుండీలు ఏర్పాటు చేయవద్దని సయితం ఆదేశించాం.