సీఆర్డీఏ ప్రతినిధులకు అరుదైన గౌరవం లభించింది. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రఖ్యాత ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ ముందుకొచ్చింది. అమరావతిలో ఇటీవల నిర్వహించిన ‘సంతోష నగరాల సదస్సు’ దరిమిలా జరిగిన ముఖ్య పరిణామంగా దీనిని భావిస్తున్నట్టు సీఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ ప్రొఫెసర్లు ప్రస్తుతం ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు’కు రూపకర్తలుగా ఉన్నారు. ఆర్థిక, రాజనీతి, వాణిజ్య శాస్త్రాలకు సంబంధించి ‘ఎల్ఎస్ఈ’ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. ఈ స్కూలులో ముఖ్య విభాగం ఉన్న ‘ఎల్ఎస్ఈ సిటీస్’ నగర, పట్టణీకరణకు సంబంధించిన అనేక అంశాలపై నిరంతర పరిశోధనలు జరుపుతుంది.
అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఈ స్కూల్ ఆసక్తిగా ప్రదర్శిస్తున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి చెప్పారు. అభివృద్ధి, ఆర్థిక వనరులు, భవిష్యత్ రవాణా వ్యవస్థ తదితర అంశాలపై ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ విద్యార్థులు రెండు నెలల పాటు అధ్యయనం చేయడానికి వస్తున్నట్టు తెలిపారు. అమరావతి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అక్కడ తమ విద్యార్థులకు లెక్చర్ ఇవ్వడానికి సీఆర్డీఏ తరఫున నలుగురు ప్రతినిధులకు ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ ఆహ్వానం పంపిందని చెప్పారు. జూన్ 4 నుంచి 8 వరకు వీరక్కడ లెక్చర్లు ఇవ్వనున్నారని తెలిపారు. అలాగే, ఆగస్టులో ‘ఎల్ఎస్ఈ సిటీస్’ విద్యార్థులు అమరావతి సందర్శిస్తారని, రెండు నెలల పాటు ఇక్కడ అధ్యయనం చేస్తారని వివరించారు. కొసమెరుపు ఏంటి అంటే, ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ లో, మన ప్రతిపక్ష నేత కూతురు చదువుతుంది.
వచ్చే నెలలో ‘డెవలపర్స్ కాంక్లేవ్’.. సీఆర్డీఏ ఆధ్వర్యంలో వచ్చే నెల మొదటివారంలో అమరావతిలో ‘రియలెస్టేట్ డెవలపర్స్ కాంక్లేవ్’ జరగనున్నది. ఈ సదస్సులో పలు, జాతీయ, అంతర్జాతీయ రియలెస్టేట్ సంస్థలు పాల్గొంటున్నట్టు సీఆర్డీయే కమిషనర్ చెప్పారు. డీఎల్ఎఫ్, ఆర్ఎంజెడ్, మైహోమ్, మహీంద్రా లైఫ్ స్పేసెస్, అపర్ణ కనస్ట్రక్షన్స్, సాలార్పురియా సత్వా, దివ్యశ్రీ, షాపూర్జీ, పల్లోంజీ తదితర సంస్థలు ఈ కాంక్లేవ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం ఇచ్చాయని తెలిపారు.