రాష్ట్రపతి కోవింద్‌ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో రాష్ట్రపతిని కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ ఆర్ధిక మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలను మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు.
కొన్ని రోజుల క్రితం, అమరావతిలో 5 రాష్ట్రాలు సమావేశం అయ్యాయి. ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా కేంద్ర ప్రభుత్వ తీరు వుందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకుంటోందని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు అద్దంపడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటిసారి ఈ సమావేశం జరగ్గా, రెండో సమావేశానికి అమరావతి ఆతిధ్యం ఇచ్చింది.
2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు చేస్తామంటే జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్ధికంగా పురోగతిలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించేట్టుగా వుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదని చెప్పారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ఆ నిర్ణయం ప్రకారం, ఈ రోజు, 5 రాష్ట్రాలు వెళ్లి రాష్ట్రపతిని కలిసాయి.