“గుడిని మింగేవాడు ఒకడైతే – గుడిలోని లింగాన్ని మింగేవాడు మరొకడు” అన్నట్టుగా, మోడీ-అమిత్ షా కర్ణాటకలో వేస్తున్న వేషాలను పరిగణలోకి తీసుకుని, వారికే జర్క్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ... కర్ణాటక రాజకీయ సెగ ఇప్పుడు, బీహార్ గోవాను తాకింది.. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రేపు రాజ్‌భవన్‌కు వెళ్లి.. తమది కూడా అతిపెద్ద పార్టీనేనని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరనున్నారు. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాజ్‌భవన్ వరకూ మార్చ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఈ డిమాండ్‌ను తెరపైకి తేవడానికి కన్నడ రాజకీయం కారణమైంది. ఈ పరిణామంపై గోవా కాంగ్రెస్ మండిపడుతోంది. కర్ణాటకలో వర్తించిన నిబంధన తమకు ఎందుకు వర్తింపజేయలేదని గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
మరో పక్క బీహార్ లో కూడా ఇదే డిమాండ్ తెర పైకి వచ్చింది. బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వియాదవ్ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. కర్నాటకలో అతిపెద్ద పార్టీ అయినందున బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చినందున, బీహార్‌లోనూ మాకూ అవకాశమివ్వాలన్నారు. బీహార్‌లో మాదే అతిపెద్ద పార్టీ అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద పార్టీనే అవసరమైతే, బీహార్‌లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీనే అన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కర్నాటకలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. అందుకే రాష్ట్రపతి... బీహార్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన ఆర్జేడీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు.
ఇది ఇలా ఉండగా, కర్ణాటక శాసనసభ ప్రాంగణమైన విధానసౌధ వద్ద కాంగ్రెస్, జేడీఎస్ నిరసన దగ్గర కాంగ్రెస్ జాతీయ నేతలు అశోక్ గెహ్లాట్, గులాంనబీ అజాద్, మాజీ సీఎం సిద్ద రామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి బైటాయించారు. సుప్రీం కోర్టులో అర్థరాత్రి హైడ్రామ తర్వాత గురువారం ఉదయం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం జరిగింది. ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దాంతో పోరాటాలకు దిగాలని కాంగ్రెస్, జేడీఎస్ నిర్ణయించాయి. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహస్యంపాలైందని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. గవర్నర్ నిర్ణయంపై సిద్ద రామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మెజారిటీ సభ్యులు తమవైపే ఉన్నారని ఆయన చెప్పారు.