బీజేపీకి సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది... 15 రోజుల టైంతో, మ్యానేజ్ చెయ్యాలి అని చుసిన బీజేపీకి చుక్కు ఎదురు అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో రెండో రోజువిచారణ జరిగింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం భావించింది. ఈ ఉదయం 10.30గంటలకు సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ యడ్యూరప్ప గవర్నర్‌ను కోరిన లేఖలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో భాజపా తరఫున వాదిస్తున్న ముకుల్ రోహత్గి ఆ లేఖలను కోర్టుకు అందించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని, బలపరీక్షలో దీన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రోహత్గి తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఇంతకంటే ఏం చెప్పలేమన్నారు. కాగా.. గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం తేలాలంటే బలపరీక్షే సరైన మార్గం అని న్యాయస్థానం భావిస్తోంది. రేపే బలపరీక్ష పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. దీనికి కాంగ్రెస్-జేడీఎస్ కూడా అంగీకరించాయి. ‘ఎవర్ని పిలిచారు అన్నదాన్ని పక్కనబెడితే బలపరీక్షే దీనికి పరిష్కారం. శాసనసభలోనే బలాబలాలు తేలాలి. బలపరీక్ష రేపే నిర్వహిస్తే ఏమవుతుంది’ అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా ఏజీ రోహత్గి స్పందిస్తూ.. బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. తాము ఎవరికీ సమయం ఇవ్వాలనుకోవడం లేదని వ్యాఖ్యానించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టును కోరారు. కానీ దీనిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎమ్మెల్యేలు తమ చేతులు పైకి ఎత్తడం ద్వారా మద్దతు తెలియజేయాలని, ఎమ్మెల్యేల సంఖ్యను స్పీకర్ లెక్కించాలని తీర్పు చెప్పింది.