మాటలతో మురిపిస్తూ... వరాల జల్లులు కురిపిస్తూ... తూర్పు అభివృద్ధికి హామీలిస్తూ... వివిధ వర్గాలకు సాయం అందిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో మంగళవారం సుమారు ఏడు గంటలపాటు సందడిగా గడిపారు. ప్రకృతి అందాల విడిది కోనసీమలో పర్యాటకానికి మరింత సొబగులు అద్దుతామన్నారు. నవ నిర్మాణ వేళ నవ్యబాటన నడుద్దామని జిల్లావాసుల్లో ఉత్సాహం నింపారు. చంద్రన్న పెళ్లికానుకలిచ్చి... ఇళ్లస్థలాలు అందిస్తూ... లబ్ధిదారులకు అండగా నిలిచారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం అమలాపురం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన క్షణం తీరిక లేకుండా సాగింది. ఉదయం పదిన్నర గంటలకు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ఏకబిగిన పలు కార్యక్రమాల్లో క్షణం తీరికలేకుండా గడిపారు. ప్రజలతో మమేకమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామదర్శిని పేరుతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు బీజేపీ పై నిప్పులు చెరిగారు. ‘పోలవరానికి ఇస్తామన్న నిధులను కేంద్రం ఇవ్వలేదు. కాకినాడ వద్ద పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటు విషయంలోనూ రూ.5500 కోట్లను ముందే చెల్లించాలంటూ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని ఒడిశాను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలని చూశారు. విశాఖలో గిరిజన విశ్వవిద్యాలయం, లోటు బడ్జెట్ విషయంలో కేంద్రం సహకరించలేదు. భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితిలో లేం’అని కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్యాస్, ఆయిల్ నిక్షేపాలను తరలించుకుని పోతూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదని అరోపించారు.
‘వెంకటేశ్వర స్వామినీ కుట్రల్లో ఇరికిస్తున్నారు. ఇటీవల ఒక పూజారితో కుట్ర రాజకీయాలు చేశారు. యాదవ కులానికి చెందిన వ్యక్తిని తితిదే ఛైర్మన్‌గా నియమిస్తే భాజపా రాద్దాంతం చేసింది. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దు. అలజడి, గొడవలు చేసి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందనే ప్రచారం చేసి బలహీన పరిచే కుట్ర చేస్తున్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భాజపా రాయలసీమ డిక్లరేషన్ అంటే పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. తుని సంఘటన ఇలా జరిగిందే. ప్రజలంతా సమైక్యంగా ఉంటూ వీటిని ఎదుర్కోవాలి. 2019 ఎన్నికలు రాష్ట్రానికి చరిత్రాత్మక అవసరం. మరో 5 సంవత్సరాలు కష్టపడితే మిగిలిన రాష్ట్రాలతో సమానంగా మనం అభివృద్ధిలోకి వస్తాం. జరగరానిది జరిగితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.’అన్నారు.