నాలుగేళ్ళు చంద్రబాబు శభాష్ అంటూ, గత మార్చ్ నుంచి ఉన్నట్టు ఉండి, చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడని విధంగా, పరుష పదజాలంలో చంద్రబాబుని తిడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు బీజేపీతో పోరాడుతుంటే, చంద్రబాబుని బలహీనపరుస్తూ, నేషనల్ మీడియాకు ఎక్కి మరీ చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు ఇంగితం లేదు అన్నారు... చంద్రబాబు ఇసుక కరా కరా తింటున్నారు అన్నారు... మేము రోడ్లు వేసాం అని లోకేష్ అంటుంటే, ఏ ఇది నీ తాత గాడి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా ? మీ నాన్న నువ్వు కలిసి, కంకరు, సిమెంట్ కలుపుతున్నారా అనే దిగజారుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు పవన్... ఇక పవన్ సినిమా అభిమానులు అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబుని, లోకేష్ ని ఎలా తిడుతున్నారో చెప్పే పని లేదు..
ఈ సందర్భంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. విశాఖలో పవన్ కు స్వాగతం పలికేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతిచెందారు. తోళెం నాగరాజు (28), భీమవరపు శివ (31) అనే ఇద్దరు యువకులు సాయిమహల్ జంక్షన్ దగ్గర స్వాగత ఫ్లెక్సీలు కట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలను రహదారి పక్కన కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో వారు షాక్‌కు గురై మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వారిని ఆదుకోవటానికి ముందుకు వచ్చింది. చంద్రన్న భీమా ద్వారా వారికి సహయం చేసారు. పాయకరావుపేట ఎం.ఎల్.ఏ అనిత, ఆ కుటుంబాలని పరామర్శించి, చంద్రన్న భీమా ను పంపిణీ చేసి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం పార్టీలు చూడలేదు. వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌరులుగా ఈ పధకానికి అర్హులు. ప్రభుత్వం వారిని ఆదుకుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, విజయనగరంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, చంద్రన్న భీమ పధకం పేరు గొప్ప....ఊరు దిబ్బ అని ఎగతాళి చేసారు. ఇప్పుడు ఆ పేరు గొప్ప....ఊరు దిబ్బ పధకమే, రెండు కుటుంబాలకు ఆసరా అయ్యింది. ఎంతో మంది అభాగ్యులను చంద్రన్న భీమా ఆదుకుంటుంటే, పవన్ కళ్యాణ్ ఎదో మాట్లాడాలి కాబట్టి విమర్శించి చేతులు దులుపుకోవటం కాదు.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి... విమర్శలు హేతుబద్ధంగా ఉంటే, అందరికీ ఉపయోగం ఉంటుంది...