అంతర్జాతీయ సంతోష స్థాయుల్లో ఆంధ్రప్రదేశ్ గతేడాదితో పోల్చితే ఒక్కసారిగా 30 స్థానాలు పైకి ఎగబాకి, 44వ స్థానానికి చేరింది! ఏటేటా ఐక్యరాజ్యసమితి ప్రకటించే సస్టెయినబుల్ డెవలప్ మెంట్ ఇండెక్స్‌లో గతంలో మన రాష్ట్రం 74వ స్థానంలో ఉండేది. అయితే ప్రజల్లో సంతోష, సంతృప్తకర స్థాయులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలనివ్వడంతో, ప్రస్తుతం 44వ స్థానంలో నిలిచింది. ఇక, రాష్ట్రంలోని జిల్లాల్లో అత్యంత సంతోషకర జిల్లాగా కృష్ణా ఎంపికైంది. ప్రతి సంవత్సరం ఐరాస అంతర్జాతీయస్థాయిలో హ్యాపీనెస్ ఇండెక్స్‌ను కొలుస్తుంది. ఇందుకోసం అది ప్రధానంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అవి.. సామాజిక మద్దతు, ఆదాయ స్థాయులు, అవినీతిరహితం, అభివృద్ధి, జీవనానందం ఆధారంగా సంతోష స్థాయులను నిర్ణయిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో పనిచేస్తోంది. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని 3 అత్యుత్తమ రాష్ట్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా (అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా) తయారు చేయటమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. విశ్వస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సంతోషదాయక సమాజాన్ని సృష్టించటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రజల సంతోషాన్ని, సంక్షేమ స్థాయులను కొలమానంగా తీసుకొని సర్వే చేశారు. ప్రజల సంతోష సూచిక స్థాయులను అంచనావేయటానికి అంతర్జాతీయ సమాజం నుంచి ఐక్యరాజ్యసమితి, ఒ.యి.సి.డి (organization for Economic Co-Operation and Development) ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు నిర్ధేశించిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు.
నాలుగేళ్ల నాడు అంటే 2012లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ-జనరల్ బాన్‌కీమూన్ సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థ (Sustainable Development Solutions Network..(SDSN))ను ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG) రూపకల్పన, అమలుకు ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికే సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థ (SDSN) వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ అధ్యయనానికి తీసుకున్న గీటురాళ్లనే ప్రాతిపదికగా తీసుకుని దేశ సగటుతో, ప్రపంచ దేశాల ర్యాంకింగ్స్‌తో పోల్చి ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయులను (హ్యాపీనెస్ లెవెల్స్) అంచనా వేయటం జరిగింది. దేశంలో ప్రజా సంతోష సూచిక నిర్ధారణకు విశ్వస్థాయి పద్ధతులను అనుసరించి ఫలితాలను రాబట్టిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.