చంద్రబాబు ఒక సీక్రెట్ సర్వే చేపిస్తున్నారు.. దీని కోసం గూఢచార శాఖ రంగంలోకి దిగింది.. ఒక పక్క ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతూ ఉన్నా, స్వయంగా గ్రౌండ్ లెవెల్ సర్వే ఒకటి చేపిస్తున్నారు చంద్రబాబు. ప్రజల మూడ్ ఎలా ఉంది ? ప్రభుత్వం పై ఎలాంటి అబిప్రాయం ఉంది ? లోపాలు ఏంటి ? జగన్ వైపు ఎంత మంది వెళ్తున్నారు ? పవన్ ప్రభావం ఉంటుందా ? తదితర విషయాలను తెలుసుకుని పక్కా లెక్కకు వచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. బూత్ల వారీ కొందరిని ఎంపిక చేసి, వారి సెల్నెంబర్లను ఇచ్చి వారి నుంచే సర్వే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని నిర్దేశించింది. దీంతో రంగంలోకి దిగిన గూఢచార శాఖ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. అందుకు అనుగుణంగా నియోకవర్గాల వారీ సంపూర్ణ నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయి.
మొన్నటి దాక ఐవీఆర్ఎస్ సర్వేల్లో, పార్టీ వ్యవహారాలపై ఐవీఆర్ఎస్ సర్వేలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల వారీ గుర్తించిన పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకునేందు కు ఇటీవల ఆయన సర్వేలు చేయించారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ఒక సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ సర్వేల, వారి ఎంపిక విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని సామాజిక వర్గాలు, అన్ని వయస్సుల వారు అలాగే అన్ని రంగాలకు చెందిన వారు ఉండే విధంగా ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆ యా నియోజకవర్గాల వారీ పార్టీ ఎమ్మెల్యే, ఇన్చార్జి పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా గమనించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం పరిస్థితి, నాయకులపై ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో గూఢచార శాఖ సిబ్బంది ఆయా నియోజకవర్గాల వారీ ప్రజల మొగ్గు టీడీపీకి ఏ స్థాయిలో ఉంది, వైసీపీకి ఎంత ఉంది? జనసేన ప్రభావం ఉండబోతుం దా? తదితర అంశాలను క్రోడీకరిస్తూ నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సర్వేని అత్యంత రహస్యంగా నిర్వహిస్తుండగా, వివిధ రూపాల్లో క్రమేపీ వ్యవహారం బయటకు పొక్కింది. టిడిపి నాయకుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు అవ్వక్కయ్యారు. చంద్రబాబు ఎంతో పకడ్బందీగా సర్వే చేపిస్తున్నారని తెలుసుకుని, ఆ సర్వే సమాచారం తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సర్వేని బట్టే తరువాత ఎన్నికల్లో టికెట్లు తదితర అంశాలు ముడిపడి ఉండటంతో, ఈ సర్వే ఫలితాల పై అందరికీ ఆసక్తి నెలకొంది..