కొంత మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేల పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరిని ఉద్దేశించి ఆయన కటువుగా మాట్లాడుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా పరోక్షంగా చురకలు అంటిస్తున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం హెచ్చరికలతో ఆందోళన చెందారు. మరికొందరు భుజాలు తడుముకున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లపై చంద్రబాబు పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేయడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది."మీ తప్పులు నా నెత్తిన వేసుకోను. మీ కోసం నేను మునగను. కొంతమంది పైపైన తిరుగుతున్నారు. వాటిని నేను గమనిస్తున్నాను. నాకు ఏ నియోజవర్గంలో ఏమి జరుగుతుందో మొత్తం తెలుసు! మీరేంచేస్తున్నారో నాకు తెలియదనుకుంటే పొరపాటు పడినట్టే. మీకు త్వరలోనే నియోజకవర్గాల్లో మీ పరిస్థితి ఏంటో చెబుతాను'' అంటూ చంద్రబాబు చురకలు అంటించారు.
"కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులను నేను నా నెత్తిన వేసుకోను. ఎవరూ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం పనిచేయవద్దు. అధికారం ద్వారా ప్రజలకు సేవచేసి పది కాలాలపాటు ఆ హోదాని నిలుపుకునే విధంగా మసలుకోండి'' అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్కడితో ఆయన ఆగలేదు. మరింతగా తన స్వరం పెంచారు. "సైకిల్ ర్యాలీలు నిర్వహించమంటే కొంతమంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు పైపైనే తిరుగుతున్నారు. నేను ఏదైనా పని చెబితే ఒక చెవితో విని, మరో చెవిలోంచి వదిలేస్తున్నారు. అటువంటి వారిని వదిలిపెట్టను. సీరియస్నెస్ లోపించింది. కొందరు నేతలైతే విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీతో పాటు పార్టీ మునుగుతుంది. అలా జరగనివ్వడానికి నేను సిద్ధంగా లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి వారి స్థానమేంటో త్వరలోనే చూపిస్తాను'' అంటూ చంద్రబాబు తీక్షణంగా హెచ్చరించారు.
ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మరోవైపు ప్రతిపక్షలు విమర్శలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో విపరిణామాలను ధీటుగా ఎదుర్కొనేందుకు బాబు సమాయత్తమయ్యారు. పార్టీ నేతలకు అందుకే చురకలు అంటిస్తున్నారు. సమన్వయ కమిటీ భేటీ చివరిలో "మీలో కొంతమంది వ్యవహారశైలి సరిగ్గా లేకపోతే సరిదిద్దుకోవాలని చెబుతా. వినకపోతే చర్యలు తప్పవు'' అని కూడా చంద్రబాబు ముక్తాయింపు ఇచ్చారు. దీంతో కొందరు నేతలకు ముచ్చెమటలు పట్టాయి. పార్టీ కార్యక్రమాల్లో కొందరు చురుకుగా పాల్గొనడం లేదు. తమ తప్పు లేకపోయినా తనపైన, పార్టీపైన ప్రతిపక్షం చేస్తున్న విమర్శల పట్ల కొందరు సరిగా రియాక్ట్ కావడం లేదు. ఈ అంశాన్నీ చంద్రబాబు దృష్టికి వచ్చాయి. అందుకనే ఆయన ఏడాది ముందునుంచే పార్టీ నేతలను స్కాన్ చేస్తున్నారు. ట్రాక్ తప్పితే పక్కనపెట్టడం ఖాయమన్న సంకేతాలు పంపుతున్నారు.