అమరావతిపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఒక పక్క ట్విట్టర్ లో స్పందించారు. మరో పక్క మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో పనులే ప్రారంభం కాలేదని షా చెప్పడం దారుణమన్నారు. యూసీలు పంపిస్తే నిజమైనవి కావని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చేసినట్లు బుకాయిస్తారా? అని నిలదీశారు. అమరావతి ప్రణాళికలు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు ఇవ్వకుండా మొండికేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు, లోటు బడ్జెట్‌కు ఎలాంటి యూసీలు కావాలో అమిత్ షా చెప్పాలని ఎద్దేవా చేశారు.
అమిత్ షా నిన్న చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమైనదని చంద్రబాబు తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షుడికి యూసీల విషయం ఎందుకని ప్రశ్నించారు. యూసీలు ఇచ్చామో.. లేదో ప్రధాని మోదీ చెప్పాలి గానీ.. అమిత్ షాకు ఎందుకని మండిపడ్డారు. పాలనా అంశాల్లో జోక్యం చేసుకోవడానికి ఆయనెవరని ప్రశ్నించారు. దేశంలోని ప్రజల సొమ్ము అంతటినీ గుజరాత్‌కు ఎలా తరలిస్తారని చంద్రబాబు నిలదీశారు. అమిత్ షా ఇప్పటికైనా దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయం చేయాలని అడిగితే పవన్‌కల్యాణ్ వంటి వాళ్లతో ప్రభుత్వంపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తే ఒక్కశాతం ఓట్లు కూడా రావని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ విషయం పై, ఆర్ధిక మంత్రి యనమల కూడా స్పందించారు. కావాలనే ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు యూసీల పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. యూసీలు సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ ఎప్పటికప్పుడు యూసీలు అందజేస్తోందని తెలియజేశారు. కానీ అమిత్ షా మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిధులు ఎగ్గొట్టేందుకు ఇదో కొత్త నాటకమన్నారు. యూసీలు ఇవ్వకుండా కేంద్రం నిధులు విడుదల చేయదన్నారు. ఈ విషయాన్ని అమిత్‌షా తెలుసుకోవాని యనమల సూచించారు.