కొద్దిరోజుల క్రితం బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారమే రేపాయి. జీవీఎల్ చెప్పినట్టుగానే కమలనాథులు కర్ణాటక ఎన్నికలు ముగిసిన మరుక్షణమే ఏపీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్’ మొదలైనట్టుగానే అనిపిస్తోంది. ఏపీలో పార్టీల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ గడప ముందు నిల్చున్న కన్నాను వెనక్కి రప్పించి.. ఇప్పుడు ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవినే కట్టబెట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీడీపీకి వెన్నుదన్నుగా ఓ సామాజిక వర్గం, వైసీపీకి అండగా మరో సామాజిక వర్గం ఉన్నాయని.. బీజేపీ కూడా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే కన్నాకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా కన్నాతో చర్చలు జరపడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. మరో పక్క పవన్ కళ్యాణ్ తో ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని దూరం చెయ్యటానికి గేమ్ మొదలు పెట్టారు. రమణ దీక్షితులు ద్వారా ఈ గేమ్ ఆడిస్తున్నారు. ఐవైఆర్ కృష్ణా రావు ఎలాగూ వారి కంట్రోల్ లోనే ఉన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా, ఈ రెండు సామాజిక వర్గాలకు, చంద్రబాబు అనేక సహాయాలు చేసారు, చేస్తున్నారు. అందుకే, వీరిని దూరం చేసే ఆపరేషన్ మొదలు పెట్టారు.
బీజేపీకి అధికారంలోకి వచ్చే సత్తా ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ ఈ రెండు సామాజికవర్గాలను తమ వైపు తిప్పుకోవాలని.. తద్వారా టీడీపీకి నష్టం కలిగించాలన్నదే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే.. అమిత్ షా మార్క్ రాజకీయాలు ఏపీలో ఫలిస్తాయా అన్నది కూడా అనుమానమే. బీజేపీపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి వారితో జగన్, పవన్ కలిసిపోయారనే సిగ్నల్స్ ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. బీజేపీపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కాస్తోకూస్తో చల్లారాలంటే రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది గానీ.. ఇలా పార్టీని బలోపేతం చేసే నిర్ణయాలతో రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న కమలనాథుల ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియాలంటే 2019 ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.