మరో సంవత్సరంలో ఎన్నికలకు వెళ్తున్న చంద్రబాబు సర్కార్ కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ వినిపించింది... మరో పక్క 2003లో లాగా, చివరి సంవత్సరంలో కరువు వస్తుంది అని,తద్వారా రైతుల్లో వచ్చే వ్యతిరేకత క్యాష్ చేసుకుందామని చూస్తున్న విపక్షాలకు మాత్రం బ్యాడ్ న్యూస్... అండమాన్‌ను గురువారం తాకిన నైరుతి రుతుపవనాలు ఈనెల 29కల్లా కేరళ పరిసరాల్లోకి ప్రవేశించనున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవన కరెంట్ బలపడింది. ఈ ప్రభావంతో జూన్ 1 లేదా 2వ తేదీకల్లా రాయలసీమకు, 3 లేక 4వ తేదీకల్లా కోస్తాకు రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈనెల 29నాటికి కేరళ, దక్షిణ తమిళనాడు, లక్షద్వీప్ పరిసరాల్లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, లక్షద్వీ్‌పలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
సోమవారంనాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో రుతుపవన కరెంట్ బలంగా ఉండడంతో ఒకటి,రెండు రోజుల్లో కేరళ నుంచి కర్ణాటక వరకు తీరంవెంబడి ద్రోణి ఏర్పడనుంది. రుతుపవనాల ప్రభావంతో వాయువ్య, మధ్యభారతంలో మంచి వర్షాలు కురుస్తాయని, దక్షిణాదికి వచ్చేసరికి స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరో పక్క ఈ ఏడు వర్షాలు బాగా పడతాయని కూడా వాతవరణ శాఖ చెప్పింది. దీంతో రైతులు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా జూన్ మొదటి లేదా రెండో వారంలో కాలువల్లోకి నీరు విడుదల చెయ్యటానికి రెడీ అవుతుంది. పట్టిసీమ నుంచి క్రిందటి ఏడు 160 టియంసి దాకా తీసుకువచ్చిన ప్రభుత్వం, ఈ ఏడు 200 టియంసి దాకా తీసుకువచ్చే ఆలోచలనలో ఉంది. దీని కోసం ఇప్పటికే అవసరం అయిన చోట, కాలువలు వెడల్పు పనులు పూర్తి చేసారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కూడా ఊరిస్తూ ఉండటంతో, రైతుల్లో సానుకూలత ఎక్కువగా ఉండే అవకాసం ఉంది. మొత్తానికి, ఈ ఏడు వర్షాలు బాగా పడతాయనే వార్తలు నేపధ్యంలో, పూర్తి చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లతో, రైతులకి బాగా లబ్ధి చేకుస్తుంది అని, చంద్రబాబు సర్కార్ ఎంతో సంతోషంగా ఉంది.