గౌరవనీయులైన టీటీడీ ఈవో గారికి ఓ భక్తుడు వినమ్రంగా రాయు లేఖ. భగవంతుడిని విమర్శించే వారికి, ధర్మాన్ని, దైవాన్ని ధిక్కరించే వారికే తప్ప స్వామి పట్ల భక్తిని ప్రకటించే వారికి మీడియాలో చోటు లేదు. అందుకే సోషల్ మీడియా ద్వారా మా మనోభావాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము. మాకు తెలిసి తిరుమలలో ఉన్నంత గొప్ప ఏర్పాట్లు, భద్రత, సదుపాయాలు, నిర్వహణ, ఆధ్యాతమ్మిక వాతావరణం ప్రపంచంలో మరే ఆధ్యాత్మిక క్షేత్రంలోనూ కనిపించదు. ఇంటికి పట్టుమని పదిమంది వస్తే నానా హైరానా పడిపోతాం. అలాంటిది సగటున రోజుకు లక్షమంది వచ్చినా వేడివేడి అన్నం ఉచితంగా ఏ సమయంలో వచ్చినా పెడుతూ అతి తక్కువ ధరకు ఆశ్రయం కల్పిస్తూ టీటీడీ ఆదరిస్తోంది.
కొండ దిగుతూ ప్రతి భక్తుడు అయ్యో మరో రెండు రోజులు ఉంటే బాగుండు అనుకుంటాడు. మరల స్వామి దర్శనం ఎప్పుడు కలుగుతుందో అని ఆశగా వేడుకుంటాడు. అదీ ఆ సప్తగిరుల మహాత్యం. నిత్యం సుప్రభాతం వినిపించే చోట నేడు తిట్లపురాణం.. వేదమంత్రాలు ఘోషించే చోట కుళ్లు రాజకీయాలు..! వివాదాస్పద వ్యాఖ్యలు.. పవిత్ర పుణ్యక్షేత్రం అనే విచక్షణ, వివేకం మరచిపోతున్నారు మన రాజకీయ నాయకులు. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధం. స్వామి నామస్మరణ ఒక్కటే ప్రతిధ్వనించాలి. తిరుమలలో దైవారాధన తప్ప రాజకీయ దూషణ నిషిద్ధం. కానీ టీటీడీ దానిని అమలు జరపలేక పోతోంది. ఫలితంగా ప్రతి నాయకుడు ఒక టికెట్ బుక్ చేసేసుకుని తిరుమల వచ్చి దర్శనం చేసుకుని బయటకు రాగానే మీడియా గొట్టాల ముందు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు.
ఇక్కడ వార్తల సేకరణకు తెలుగుతోపాటు ఇంగ్లిషు, తమిళ చానళ్ల ప్రతినిధులు, వివిధ భాషల పత్రికా విలేకరులు అధిక సంఖ్యలో ఉన్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలను కవర్ చేసేందుకు బ్రేక్ సమయంలో మీడియా ఆలయం ముందే సిద్ధంగా ఉంటుంది. స్వామి దర్శనం ద్వారా దక్కిన పుణ్య ఫలాన్ని మరు క్షణంలో పర దూషణల ద్వారా బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఆ జ్ఞానం వారికి ఉండక పోవచ్చు. పురాణాలను అవపోసన పట్టిన పండిత జనంతో అలరారే టీటీడీకి ఏది పుణ్యం ఏది పాపం తెలుసు. రాజకీయ, వ్యక్తిగత విమర్శలు తిరుమలలో చేసిన కారణంగా అమితమైన ప్రచారం లభిస్తోంది. రానురాను తిరుమలలో లక్షల మందికి జరిగే మంచి కంటే ఎవరో ఒకరు వచ్చి చెడు మాట్లాడితే అదే ప్రపంచానికి ఎక్కువ చేరుతోంది. అందుకే మా విన్నపం ఏమిటంటే తిరుమలలో రాజకీయ ప్రసంగాలు మీడియా ముందు మాట్లాడాన్ని నియంత్రించి భక్తుల మనోభావాలను కాపాడండి. దీనిపై దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలతో చెప్పించండి. తిరుమలలో రాజకీయాలు వద్దు అని వారిని పిలుపు ఇవ్వండని చెప్పండి.
తిరుమల అర్చక స్వాములతో ఆ క్షేత విశిష్టత, అక్కడ దూషణల వల్ల సంక్రమించే పాపం గురించి చెప్పించండి. ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు టీటీడీ తరపున విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయండి. ఇప్పుడు సుప్రీం కోర్టుపైనో మరో న్యాయస్థానం పైనో ఎవరైనా ఆరోపణలు చేస్తే మీడియా ప్రచురించదు. ఎందుకంటే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుందని. మరి ఆ భయం స్వామి విషయంలో ఉండక్కర్లేదా? అందుకే మీడియా కూడా తిరుమలలో రాజకీయ ప్రసంగాల ప్రసారాలను ఎవాయిడ్ చేస్తే బాగుంటుంది. అందుకు టీటీడీ పూనుకుని మీడియా యాజమాన్యాలకు విజ్ఞాపన లేఖ రాస్తే బాగుంటుంది. ఎవరన్నా నాయకులు కావాలంటే తిరుపతిలో మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ రాష్ట్రంలో కొదువే లేదు. ఎక్కడికి వెళ్లి అయినా ఎవరిని అయినా విమర్శించండి. రాజకీయ ప్రసంగాలు చేయండి. కానీ స్వామి వేంచేసి ఉన్న ఒక్క తిరుమలను మాత్రం మీ రాజకీయాల నుంచి మినహాయించండి. రాసిన భక్తుడు ఎవరనేది పక్కన పెట్టి దీనిలో మంచిని స్వీకరించండి.