ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైలీ సీరియల్ ప్రభావంతో మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందోమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్నదాడులు, డైలీ సీరియల్ ప్రభావంపై స్పందించిన ఆమె మాట్లాడుతూ ఇలాంటి వాటిపై సమాజం పట్టించుకోవాలని, చట్టాలు గట్టిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇరుగు పొరుగువారు కూడా ఏం జరుగుతుందో గమనించాలని అన్నారు. ఆత్మ, ప్రాణ, మాన రక్షణ కోసం మహిళలు పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడకుండా తనను తాను రక్షించుకోవడం కోసం.. లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిపై దాడి చేయాలని, ఖచ్చితంగా ఆయుధం తీసుకుని తిరగబడాల్సిందేనని నన్నపనేని అన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆమె వివరించారు. అలాగే మహిళలు కూడా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తలను కిరాయి గుండాలతో హతమారుస్తున్నారని నన్నపనేని అన్నారు. ఈ విధంగా మహిళలు పాల్పడ్డానికి కొన్ని చానల్స్‌లో వచ్చే డైలీ సీరియల్స్ ప్రభావం ఎంతో ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీరియల్స్ చాలా దారుణంగా ఉంటున్నాయని... ఎక్కువగా మహిళలే విలన్ పాత్రలు పోషిస్తున్నారని నన్నపనేని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులను ఎలా చంపాలో చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుష కమిషన్ కూడా వేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు.
తెలుగు సీరియల్స్ పై ఇప్పటికే, ప్రజల్లో చాలా వ్యక్తిరేకత వస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి, పిల్లలు కూడా చూస్తున్న సీరియల్స్ లో క్రూరత్వమే కాదు, అశ్లీలత కూడా ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే సీరియల్స్ కూడా ప్రసారం అయ్యే ముందు, సెన్సార్ అయ్యి వస్తే, కొంత మేరకు ఈ అశ్లీలత, క్రూరత్వం తగ్గుతుంది అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా, ఈ విషయం పై స్పందించాల్సిన అవసరం ఉంది. సీరియల్స్ పై నియంత్రణ వస్తే కాని, ఇలాంటివి తగ్గే అవకాసం లేదు. అందుకే, నన్నపనేని ఆవేదనలో అర్ధం ఉందని, మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా ఆమె సూచనలు, ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అని ఆశిద్దాం...