ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును ప్రభుత్వం గుర్తించింది. దీనితో పాటు మరికొన్ని ముఖ్యమైన రాష్ట్ర చిహ్నాలను బుధవారం ఖరారు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఈ చిహ్నాలను ఖరారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వృక్షంగా వేప, రాష్ట్ర జంతువుగా జింక ఇప్పటికే కొనసాగుతుండగా... రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును, రాష్ట్ర పక్షిగా రామ చిలుకను కొత్తగా ఎంపిక చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర చిహ్నాలుగా కృష్ణ జింక, వేపచెట్టు, కలువ పువ్వు, పాలపిట్ట ఉండేవి. విభజన తర్వాత నవ్యాంధ్రకు ప్రత్యేకమైన చిహ్నాలను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది.
దీనిపై సర్కారు అటవీశాఖ అధికారులతోపాటు వివిధ వర్గాలను సంప్రదించింది. కలువపూవు స్థానంలో మల్లె పువ్వును ఎంపిక చేయాలని సూచనలు వచ్చాయి. గుప్పున సువాసనలు వెదజల్లే గుండు మల్లెల సాగుకు రాష్ట్రం ప్రసిద్ధి. ఇవంటే మహిళలకు ఎనలేని మక్కువ. పూజల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పుష్పంగా మల్లెపువ్వును ఎంపిక చేశారు. ఇక... పాలపిట్టను తెలంగాణ సర్కారు తన రాష్ట్ర పక్షిగా కొనసాగిస్తోంది. విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకుంటే మంచిదని తెలంగాణ వాసులు భావిస్తారు. అయితే... నవ్యాంధ్రలో పాలపిట్టల సంఖ్య తక్కువ.
అదే సమయంలో... ఆకుపచ్చ వర్ణం, ఎర్రముక్కుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపించి, అలరించే రామచిలుకలను రాష్ట్ర పక్షిగా నిర్ణయించాలనే సూచనలు వచ్చాయి. ప్రభుత్వం దీనికే ఓటు వేసింది. చురుకైన చూపులు... చలాకీ కదలికలకు పేరు కృష్ణ జింక. నల్లమలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అడవుల్లోనూ ఈ జింకలు కనిపిస్తాయి. గతంలో రాష్ట్ర జంతువుగా ఉన్న కృష్ణ జింకకు విభజన తర్వాతా ఆ హోదాను కొనసాగించారు. వీచే గాలి నుంచి... ఆకు, పూత, విత్తనం వరకు ఆరోగ్యాన్ని అందించే వేపకు కూడా రాష్ట్ర వృక్షం గుర్తింపును కొనసాగిస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు.