మొన్నటి దాక ఏటియంల ముందు బీజేపీని తిట్టుకున్న ప్రజలు, ఇప్పుడు పెట్రోల్ బంకుల ముందు కూడా తిట్టుకుంటున్నారు.. ఈ కోపం, అంతా ప్రజలు ఓట్ల రూపంలో, బీజేపీకి తగిన బుద్ధి చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. మొత్తం నాలుగు లోక్‌సభ, 10 శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలు, కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అభ్యర్థుల ఫలితాలు వస్తున్నాయి. అధికార బీజేపీ, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాలుగు లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ మూడు చోట్ల వెనకబడింది. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్గర్, భండారా-గోండియా నియోజకవర్గాల్లో బీజేపీ వెనకబడింది. ఇక నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానంలో అధికార ఎన్‌డీపీపీ అభ్యర్థి తోకెహో ఆధిక్యంలో ఉన్నారు.
కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మునిరతన్‌కు ఇప్పటికి సుమారు 16వేల ఓట్లు పోలవగా రెండో స్థానంలో ఉన్న భాజపా అభ్యర్థి మునిరాజు గౌడకు 7వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పంజాబ్‌లోని షాకోట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఝార్ఖండ్‌లోని గోమియా అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కేరళలోని చెన్‌గన్నూర్ అసెంబ్లీ స్థానంలో సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్‌డీఎఫ్ ముందంజలో ఉంది. బిహార్‌లోని జోకిఖాట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
పశ్చిమ్‌బంగాలోని మహేస్థల అసెంబ్లీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లోని థరాలి అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా ముందంజలో ఉంది. మొత్తానికి బీజేపీకి దేశ వ్యాప్తంగా ఎదురు గాలి వీస్తుంది. అధికారంలో ఉండి కూడా, సొంత స్థానాలు కూడా నిలుపుకోలేని స్థితిలోకి బీజేపీ వెళ్ళింది. అయితే, బీజేపీ నేతలు మాత్రం, ఇవన్నీ మాకు పెద్ద లెక్క లేదు అని అంటున్నారు. మాకు 2019 ఎన్నికలు ఎలా గెలవాలో తెలుసు అని, మాకు అమిత్ షా ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటారు అంటూ, అదే అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారు.