Sidebar

01
Thu, May

రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2 వేల కోట్ల విలువ చేసే ‘అమరావతి బాండ్ల’ను జూన్ 6వ తేదీ తరువాత విడుదల చేయనున్నారు. ఈ బాండ్ల విడుదలకు సంబంధించిన ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని, ఆర్బీఐ పాలసీ ప్రకటన తరువాత వీటిని జారీచేస్తారు. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం సచివాలయంలో జరిగిన 17వ అథీకృత సమావేశంలో ఈ బాండ్లకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఎంతో గర్వంగా చెప్పుకునేలా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 55 శాతం పనులు పూర్తిచేయగలిగామని, అదే అమరావతి విషయానికి వస్తే ఆ స్థాయిలో పనులు వేగవంతంగా జరగడం లేదని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

amaravati 01062018 2

చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ జరపాలని నిర్దేశించారు. పని సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన సమర్ధ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని, జరిగిన పనిని అంచనా వేయడానికి కూడా అదేస్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. అమరావతి ప్రధాన రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఒక చోట దుమ్ము లేచి ఆ దారిన వెళ్లేవారికి ఇబ్బందిగా ఉందని, ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరంగా భావించాలని అన్నారు. వచ్చేది వర్షాకాలం అయినందున నిర్మాణ పనులు అనుకున్నట్టుగా సాగవని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా వుండాలని సూచించారు. ఇదే సమావేశంలో అంతర్జాతీయ సంస్థ ‘డస్సాల్ట్ సిస్టమ్స్’ ప్రతినిధులు అమరావతి 3డీ సిటీ డిజైన్లపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. నగర ప్రణాళికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూ ప్రకంపనలకు సంబంధించిన సూచనలు అందజేయడంలో ఈ 3డీ డిజైన్లు కీలకం కానున్నాయి.

అలాగే, నగరంలో జరుగుతున్న నిర్మాణాలను ఎప్పటికప్పుడు వాస్తవ సమయంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి డస్సాల్ట్ సిస్టమ్స్ రూపొందించే 3 డీ డిజైన్లు ఉపకరిస్తాయి. అండర్ గ్రౌండ్ పైప్‌లైన్లు మొదలు భవంతుల మధ్య గాలి, వెలుతురు వరకు 3డీ టెక్నాలజీ సాయంతో అంచనా వేయవచ్చు. కొత్త నగరంలో ఏర్పాటు చేయబోయే అత్యాధునిక రవాణా వ్యవస్థకు 3 డీ సిటీ డిజైన్ ఏ విధంగా దోహదపడుతుందో సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. డ్రైవర్ రహిత వాహనాలకు ఎప్పటికప్పుడు ఏవిధంగా సమాచారం అందేదీ విపులంగా తెలియజేశారు. అమరావతిని ప్రపంచ సంతోష నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా 3డీ సిటీ డిజైన్లను రూపొందిస్తున్నారు. ఇది నగర నిర్మాణ సమయంలోనే కాకుండా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. 6 మాసాల వ్యవధిలో 3డీ సిటీ డిజైన్లను పూర్తిచేయాలని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు.

amaravati 01062018 3

కొత్త రాజధానిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు రూపొందించిన ప్రెజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. నిర్మాణ శైలి, పచ్చదనం, జల వనరులు, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వ విధానాలు.. ఈ నాలుగింటిపై సమగ్ర దృష్టి పెట్టడం ద్వారా కనీసం 5 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చునని ప్రెజెంటేషన్‌లో వివరించారు. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ‘సింగపూర్ పవర్’ సంస్థ చేపడుతోందని, ప్రతి 440 మీటర్లకు కూల్ స్పాట్స్ ఏర్పాటు చేయడం ద్వారా 10 డిగ్రీల ఉష్ణోగ్రతల వ్యత్యాసం తీసుకురావచ్చునని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. హైకోర్టు భవంతులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, రూ.1685 కోట్ల వ్యయంతో దీనిని ఐకానిక్ నిర్మాణంగా చేపట్టబోతున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. ప్రి ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో రాజధానిలో మూడు నక్షత్రాల హోటల్ నిర్మాణాన్ని చేపట్టడానికి ‘ఫార్య్చూన్ మురళీ’ యాజమాన్యం ముందుకొచ్చిందని వివరించారు. రహదారులకు సంబంధించి పనులు శీఘ్రగతిన జరుగుతున్నాయని, ప్రధాన ఆటంకంగా ఉన్న తాడేపల్లి ప్రాంతంలో గత వారమే సర్వే పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read