సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, నిన్న ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన జగన్ కేసుల పై స్పందించారు. ఈ సందర్భంలో, ప్రస్తుతం జగన్ కేసులు నడుస్తున్న తీరు గురించి స్పందించమని అడగ్గా, తనకు జగన్ కేసులను విచారించిన అధికారిగా పేరు వచ్చినప్పటికీ, తాను ఆ ఇమేజ్ ని కోరుకోవడం లేదని చెప్పారు. నాడు తనకు అప్పగించిన డ్యూటీని తాను చేశానని, ఆనాడు తన పై ఏ విధమైన రాజకీయ ఒత్తిడులూ లేవని స్పష్టం చేశారు. ఆ కేసును తనకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, హైకోర్టు బెంచ్ నిర్ణయించి విచారించాలని అప్పగించిందని, ఎవరూ డైరెక్టుగా ఇచ్చిన కంప్లయింట్ కాదని గుర్తు చేశారు. కేసులో అందుబాటులోని సాక్ష్యాధారాల ప్రకారం తాను డ్యూటీ చేశానని, తాను ఎంతో మంది అధికారులను పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టానని, క్షేత్రస్థాయిలో ఎంతోమంది అధికారులు జగన్ కేసులపై దర్యాఫ్తు చేశారని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
తాను ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత, ఎంతో మంది అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని, దీంతో జగన్ కేసు బలహీనపడి, వీగిపోతుందని పలువురు భావిస్తున్నారన్న వార్తల పై స్పందిస్తూ, ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించలేనని, ఇప్పుడున్న అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుకుంటున్నానని తెలిపారు. తాను సీబీఐ నుంచి తప్పుకున్న తర్వాతి పరిణామాల గురించి తనకు తెలియదన్నారు. అధికారులు ఒక్కొక్కరు బయటకు వస్తుండడాన్ని తాను పేపర్లలోనే చదువుతున్నానని… తాను పనిచేసినంత కాలం ఏ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు.
తాను 2013లో సీబీఐ విధుల నుంచి బదిలీ అయిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ పై సీబీఐ కేసుల విషయాన్ని ఇప్పుడున్న సిబిఐ అధికారులని అడిగితే, తెలుస్తుందని చెప్పారు... లక్ష్మీనారాయణ, ఎంతో పర్ఫెక్ట్ గా, జగన్ పై 11 చార్జ్ షీట్లు పెట్టి, 16 నెలలు జైలులో ఉంచిన సంగతి తెలిసిందే... అయితే, ఇప్పుడు జగన్ కేసులలో వేగం తగ్గింది అనే, ఆరోపణలు వస్తున్నాయి... అందుకు తగ్గటే, పరిణామాలు కూడా జరుగుతున్నాయి.. ప్రస్తుతం లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల పై అధ్యయనం చేస్తున్నారు.. తాను ఏ పార్టీలో చేరను అంటూనే, సమయం వచ్చినప్పుడు ప్రజలకు చెప్పే చేరతాను అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.