రాష్ట్ర విభజనలో నష్టపోయిన రాష్ట్రానికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది. అది చట్టంలో ఉంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ కి, ఏ నాడు రూపాయి అడ్వాన్సు గా ఇవ్వలేదు కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. కేంద్రం ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తుంది. అది కూడా టైంకు ఇవ్వదు. ఎప్పటికో ఇస్తుంది. దీని వల్ల కనీసం ఏడాదికి, వడ్డీ రూపంలో 300 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై భారం పడుతుంది. తాజాగా మారిన పరిస్థితుల్లో, అసలు రూపాయి కూడా కేంద్రం ఇవ్వటం లేదు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1098 కోట్లను రీయింబర్స్ చేస్తున్నట్లుగా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది.
అప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని ఒకసారి.. అరుణ్ జైట్లీకి ఆపరేషన్ జరిగిందని ఒకారి చెప్పి తప్పించుకున్నారు. కొన్ని రోజుల క్రితం, ఇదిగో ఇస్తున్నాం అని ఒక ప్రకటన ఇచ్చారు.. ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తోన్న ప్రభుత్వానికి... కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కొత్తగా మరోషాక్ ఇచ్చింది. ఈ నిధులు విడుదల చేయాలంటే నాబార్డు, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చేసుకున్న మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్(ఎంవోఏ)కు సవరణ చేయాలని, కొత్తగా కొన్ని అంశాలను చేర్చాల్సి ఉందని పేర్కొంది.
దీంతో.. ఆ ఒప్పంద సవరణలను ఈ నెల 4వ తేదీన కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వద్ద ఈ ఫైలు పెండింగ్‌లో ఉంది. అక్కడి నుంచి కేంద్ర జల వనరులశాఖకు, అనంతరం నాబార్డుకు ఈ ఫైలు చేరి... రీయింబర్స్‌మెంట్ కావాల్సిన రూ.1098 కోట్లు పీపీఏ ద్వారా రాష్ట్రానికి వచ్చే సరికి మరో 15 రోజులైనా పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వచ్చినప్పుడు ఎంవోఏను సవరించాలని భావిస్తే తప్పులేదుగానీ... ఇప్పటికే రీయింబర్స్‌మెంట్‌కు ఆమోదం తెలిపిన రూ.1098 కోట్ల విడుదలకు కొత్తగా ఎంవోఏను సవరించాలని కేంద్రం నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.