పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో ముఖ్య ఘట్టం పూర్తి కావస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పనులు మొత్తం 53.50% పూర్తికాగా, ఇప్పుడు కీలకమైన డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పనులు తుదిదశకు చేరాయి. వచ్చే నెల 11 నాటికి ఈ రెండింటి నిర్మాణం పూర్తి అవుతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి 60వ సారి వర్చువల్ రివ్యూ చేశారు. డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు తుది అంఖానికి రావడంపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని నిర్మిస్తున్న కెల్లర్, బావర్-ఎల్ అండ్ టీ సంస్థలు పనులు పూర్తి చేయగానే రిలీవ్ అవుతాయని అన్నారు. వచ్చే నెల 11న తాను పోలవరం సందర్శిస్తానని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టులో భాగమైన పోలవరం కుడి ప్రధాన కాలువ 89.60%, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.60%, స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్ ఎర్త్‌వర్క్ 73.26%, స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 21.83%, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 91%, జెట్ గ్రౌటింగ్ పనులు 70%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 60.28% పనులు ఇప్పటివరకు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. గ్యాలరీ వాక్ నిర్మాణం కూడా ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. గత వారం రోజుల్లో స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 5.59 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 29 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, అలాగే డయాఫ్రమ్ వాల్ 29 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 817.32 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 8.03 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,271.60 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 10,850 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ పనుల్లో వేగం మందగించడంపై ముఖ్యమంత్రి ప్రశ్నించగా, మిషనరీలో తలెత్తిన సమస్యలతో కాస్త వెనుకబడినట్టు నిర్మాణ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలను అదే నెలలో అధిగమించాలని అధికారులకు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం కుడి కాలువ పనులను త్వరగా పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకు ముందుగా నీటిని విడుదల చేయొచ్చని సూచించారు.