మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై మన్మోహన్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని హుబ్లీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ను మోదీ బెదిరించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మన్మోహన్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాష్ట్రపతికి మన్మోహన్ ఒక లేఖ రాశారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ లబ్ది కోసం తన శక్తియుక్తులు, అధికారాలను ఉపయోగించుకుంటున్నారని సింగ్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఈనెల 6న హుబ్లీలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఘాటు హెచ్చరికలు చేశారు. 'కాంగ్రెస్ నేతలు చెవులు పెద్దవిగా చేసుకుని నా మాటలు వినండి. మీరు హద్దులు దాటితే, నేను మోదీని, మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది' అని మోదీ బెదిరించినట్టు మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు.
మోదీ మాటలు అవమానపరచేలా ఉండటమే కాక, శాంతికి విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. 'అలాంటి బెదిరింపులకు మా పార్టీ కానీ పార్టీ నేతలు కానీ బెదిరిపోరని నేను చెప్పదలచుకున్నాను' అని సింగ్ పేర్కొన్నారు. మోదీ ఉపయోగిస్తున్న బెదిరింపుల భాష, అనుచిత వ్యాఖ్యలను మన్మోహన్ తన లేఖలో ఎండగట్టారు. ఆయన రాసిన లేఖపై పార్లమెంటు ఉభయసభల విపక్ష నేతలు, కాంగ్రెస్ సీనియర్ నేతలైన పి.చిదంబరం, అశోక్ గెహ్లాట్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, మోతీలాల్ వోరా, కమల్‌నాథ్, అహ్మద్ పటేల్ తదితరులు సంతకాలు చేశారు.
ఆయనను కాస్త భాష మార్చుకోమని చెప్పాలని హితబోధ చేశారు. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. లేఖతో పాటు ప్రచారంలో మోడీ మాట్లాడిన వీడియో లింక్‌ను జత చేసి పంపించారు. ఈ సందర్భంగా మన్మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దేశంలోకెల్లా అత్యంత ప్రాచీన పార్టీ కాంగ్రెస్ అని, ఇన్నేళ్ల కాలంలో మా పార్టీ చాలా ఒడిదుడుగులు ఎదుర్కొందని, అయినా ఎక్కడా తగ్గలేదన్నారు. పార్టీ ధైర్యంగా ముందుకు సాగిందన్నారు.