ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారు ఆంధ్రా జేఏసీ చైర్మన్, న్యాయవాది సుంకర కృష్ణమూర్తి, రవీందర్ రెడ్డి.. అయితే ఈ విషయం పై సుప్రీం కోర్ట్ కొన్ని అభ్యంతరాలు తెలిపింది.. విభజన చట్టంపై ఎందుకు ఇన్ని పిటిషన్లు వస్తున్నాయని ధర్మాసనం అడిగింది... గతంలో దాఖలైన పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్‌కు, తమ పిటిషన్‌కు వ్యత్యాసం ఉందని, ఆంధ్రా సమస్యల పై దాఖలు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ , సుప్రీం కోర్ట్ కు తెలిపారు.. అయినా సరే, పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్ కేసులోనే ఇంప్లీడ్ కావాలని, సుప్రీం కోర్ట్ సూచించింది.. ఏది చెప్పాలనుకున్నా ఆ కేసులో ఇంప్లీడై చెప్పుకోవచ్చని ధర్మాసనం తెలిపింది...
ప్రధాన మంత్రి రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా 6 హామీలు, విభజన చట్టాన్ని యధాతథంగా అమలు చేయాలని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో అమరావతి నిర్మాణం చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ సమగ్రంగా అధ్యయనం చేసి సత్వరం పూర్తిచేయాలని పిటిషన్లో, పిటిషనర్లు విజ్ఞప్తి చేసారు. నాలుగు సంవత్సరాలు అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చట్టంలో చెప్పిన ఏ విషయం పూర్తి కాలేదని, ఆ పిటీషన్ లో తెలిపారు.
సుప్రీం కోర్ట్, ఈ పిటీషన్ పై ఎప్పుడు విచారణ చేస్తుందో చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వారం క్రితం, జస్టిస్ సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో వేటిని అమలు చేశారో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వివరాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. నాలుగు వారాలు సమయం ఇవ్వాలని కోరగా అంగీకరించిన ధర్మాసనం విచారణను అప్పటికి వాయిదా వేసింది.