‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాపై ఎందుకీ వివక్ష? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? మాకు ఇది జీవన్మరణ సమస్య. విశాఖ రైల్వేజోన్ మా హక్కు. దానికి అడ్డుచెబితే మీ అడ్రస్ గల్లంతే’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తిరుమలలో వెంకన్న పేరుతో చేస్తున్న రాజకీయం పై మండి పడ్డారు... వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు... టీటీడీపై లేనిపోని అనుమానాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నాకు వెంకటేశ్వరస్వామిపై చాలా భక్తి. వెంకటేశ్వరస్వామి నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తున్నారు. ఆ రోజు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వ లాంఛనాలు తీసుకు వెళ్తుంటే 24 గ్లేమోర్ మైన్స్ నాపై పేల్చినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామే నా ప్రాణాలు కాపాడాడు. ఏదో ఒక పర్పస్ కోసం.. నాతో ఏదో ఒక పని చేపించాలని కాపాడాడు. ఎవరితోనైనా పెట్టుకోండి.. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే వడ్డీతో సహా అపరాధం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా మొక్కు కోరి ఒక్క రూపాయి అయినా ఇవ్వకపోయినా ఆయన వదిలిపెట్టరు. ఆయనకు అపచారం తలపెట్టిన వాడు... ఈ జీవితంలోనే తప్పకుండా పనిష్మెంట్లు తీసుకుంటారు. అది ఆయన కుండే మహిమ. అందుకనే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వరస్వామి దగ్గరకి వస్తారు.’’ అని అన్నారు.
‘‘ఎప్పుడో 1952లో గులాబీ రంగు వజ్రం పోయిందని, అన్నీ రికార్డులన్నీ ఎస్టాబ్లిస్ చేశారు. చాలాసార్లు రిపోర్టు కూడా వేశారు. జగన్నాథరావు కమిషన్ కూడా వేశారు. అంతేకాదు ఇంకో కమిటీ కూడా వేశారు. ఇది వజ్రం కాదు. కెంపు మాత్రమే అని ఆ రెండు కమిటీలు 2011లోనే చెప్పాయి. ఇప్పుడున్న కృష్ణారావు ఆనాడు ఈవోగా ఉన్నాడు. అది వజ్రం కాదు, కెంపు మాత్రమే అని ఆ రోజు ఆయన గవర్నమెంట్‌కి రిపోర్టు పంపించారు. పోటులో ఏదో జరిగిపోయిందని, అక్కడేదో గుప్త నిధులున్నాయని, ఎవరో తవ్వుతున్నారని వీళ్లకు కలొచ్చింది. పోటులో వెంకటేశ్వరస్వామికి భోజనం తయారు చేస్తారు. వెంకటేశ్వరస్వామి తల్లి వకులాదేవి అక్కడ వంట గది అంతా సూపర్ వైజ్ చేస్తుంది. అక్కడ ఏమీ జరగకపోయినా ప్రజల్లో అనుమానం వచ్చేలా లేనిపోనివి చేయడానికి ప్రయత్నం చేశారు.’’ అని అన్నారు.